నిర్దేశం, జైపూర్: ప్రజలకు అందుబాటులో ఉంటూ తనదైన పని విధానంతో తరుచూ సోషల్ మీడియాలో నిలిచే ఐఏఎస్ టీనా డాబి మరోసారి నెట్టింట హల్ చల్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రాజస్థాన్ రాష్ట్రంలోని బర్మార్ జిల్లాకు కలెకర్టర్ గా అపాయింట్ అయ్యారు. ఎప్పటిలాగే బాధ్యతలు తీసుకున్న వెంటనే రంగంలోకి దిగారు. బర్మార్ లో గల్లి గల్లి తిరుగుతూ పారిశుధ్యాన్ని చక్కదిద్దుతున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో చేసిన ప్రచారానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
నగరంలోని వీధుల్లో తిరుగుతూ.. మైకు పట్టుకుని పరిశుభ్రతపై ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రోడ్డుపక్కన నిర్వహించే దుకాణాలు, బండ్ల నిర్వాహకులు తమ దుకాణాల ముందు పరిశుభ్రత పాటించాలని హెచ్చరించారు. ఒక షాపు ముందు శుభ్రం చేయాలంటూ అక్కడే ఉండి శుభ్రం చేశారు. ఈ సందర్భంలో షాపులో ఉన్న ఒక కుర్రాడితో శుభ్రం చేయించబోతే.. ‘‘బాలుడితో ఎందుకు శుభ్రం చేయిస్తున్నావు? నువ్ శుభ్రం చేయి’’ అంటూ షాపు యజమానిని గద్దించి, అతడితో శుభ్రం చేయించారు. పారిశుధ్య కార్మికులతో పాటు టీనా కూడా చీపురు పట్టడం గమనార్హం.
వీధులన్నింటినీ శుభ్రం చేయించిన అనంతరం టీనీ మాట్లాడుతూ.. తాను మళ్లీ వస్తానని, పరిశుభ్రత పాటించకపోతే దుకాణదారులకు జరిమానా విధిస్తామని, బండ్లను తాత్కాలికంగా జప్తు చేస్తామని హెచ్చరించారు. టీనా ప్రచారాన్ని, దూకుడును, పని తీరును చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు గుమిగూడారు. అప్పుడు కూడా వారికి టీనా ఓ సూచన చేశారు. ‘‘ఇక్కడ నుండి వెళ్లిపోండి. మన వీధులను శుభ్రపరచడంలో సహాయం చేయండి, నేను ఇక్కడ క్లీనింగ్ చేస్తాను, మీరు మీ వీధులను క్లీన్ చేయండి’’ అని చెప్పారు.
ఏ పని అయినా అలవాటుగా మారాలంటే కనీసం 90 రోజులు పడుతుందని నగరవాసులు పరిశుభ్రతను అలవాటు చేసుకునేంత వరకు కొనసాగిస్తామన్నారు. ఎప్పుడైతే పరిశుభ్రత అలవాటుగా మారుతుందో, అప్పుడు నగర ముఖ చిత్రం మారుతుందని అన్నారు. శుభ్రం చేయడానికి సిగ్గు పడకూడదని, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరం మన ఇల్లు లాంటిదేనని, మన నగరాన్ని మనం శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
2015 బ్యాచ్ కి చెందిన టీనా తన 22 ఏళ్ల వయసులో ఐఏఎస్ కొట్టారు. ఆమె ఆల్ ఇండియాలో మొదటి ర్యాంక్ సాధించారు. అజ్మీర్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టినాటి నుంచి టీనా ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ వస్తున్నారు. ఏ సమస్యనైనా స్వయంగా వెళ్లి తెలుసుకోవడం, దగ్గరుండి మరీ పని పూర్తి చేయడం టీనా స్టైల్. పెద్దగా హంగు, ఆర్భాటాలు లేకుండా జిల్లాలో తిరుగుతుంటారు. మరీ ఇలా ఉంటే నెటిజెన్లు ఊరుకుంటారా.. కలెక్టర్ అంటే టీనాలా ఉండాలని పొగడ్తలు కురిపిస్తుంటారు.