పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన కానిస్టేబుల్స్

పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన కానిస్టేబుల్స్
– డబ్బుల కోసం బ్లాక్ మెయిల్..
– ఆ ఇద్దరి కానిస్టేబుళ్లపై విచారణ..

నిర్దేశం, మహబూబ్ నగర్ :
ఖాకీ డ్రెస్ వేసుకోగానే అక్రమ సంపాదనపై ద్యాస పెట్టేవాళ్లు కొందరు. ఇగో.. అలాంటి కానిస్టేబుళ్ల వల్ల పోలీసు వ్యవస్థకే మాయని మచ్చగా నిలుస్తోంది. అక్రమ డబ్బుల కోసం పచ్చని సంసారంలో చిచ్చు పెట్టిన ఇద్దరి కానిస్టేబుళ్ల రియల్ స్టోరీ ఇది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ సంఘటన పట్ల పోలీసుల తీరుపై నెటిజన్ లు సీరియస్ అవుతున్నారు.

డబ్బుల కోసం కక్కుర్తి పడ్డారు..

నాగర్‌ కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి నాలుగు నెలల కిందట తన స్నేహితురాలితో కలిసి జర్నీ చేస్తున్నారు. ఈ క్రమంలో నాగర్‌ కర్నూల్‌లోని మెయిన్ రోడ్డు పక్కన హోటల్ వద్ద కారు ఆపి దాంట్లో భోజనం చేస్తున్నారు. ఈ సమయంలో ఓ కానిస్టేబుల్ అటుగా వచ్చారు. హోటల్ లో బోజనం చేస్తున్న వారి ఫొటోలు తీశారు. ఇక్కడ ఏం చేస్తున్నారని ప్రశ్నించిన కానిస్టేబుల్ భయభ్రాంతులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా తన దగ్గర ఉన్న ట్యాబ్‌లో నుంచి ఫొటో తొలగించాలంటే రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే కేసు నమోదు చేస్తానని బెదిరించారు. దీంతో భయపడిన ఆ వ్యక్తి రూ.2 వేలు ఇచ్చేందుకు ఓకే చెప్పారు. వెంటనే తన స్నేహితుడి ఫోన్‌పేకి ఆ కానిస్టేబుల్‌ రూ.2 వేలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు.

భార్యకు ఫోటో చూపించారు..

డబ్బులు తీసుకున్న ఆ కానిస్టేబుల్ అక్కడితో ఆగలేదు. తన వద్ద ఉన్న ఆ ఫొటోను తొలగించలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ ఫొటోను బిజినేపల్లి పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న మరో కానిస్టేబుల్‌కు పంపించారు. అతను కూడా ఫొటోతో బ్లాక్ మెయిల్ చేశాడు. డబ్బులు ఇవ్వాలని బాధితుడిని బెదిరించాడు. దీంతో చిరాకు వచ్చి.. బాధితుడు డబ్బులు ఇవ్వబోనని స్పష్టం చేశారు. దీంతో కానిస్టేబుల్ ఆ ఫొటోను బాధితుడి భార్యకు చూపించాడు. కానిస్టేబుల్ చేసిన ఈ పనితో భార్యాభర్తల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. వీరి గొడవను పెద్దలు కూర్చొని సెట్ చేశారు. ఈ వ్యవహారం.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇద్దరు కానిస్టేబుల్ లపై విచారణ..

అక్రమ డబ్బుల కోసం పచ్చని సంసారంలో చిచ్చు పెట్టిన ఆ ఇద్దరు కానిస్టేబుళ్లపై విచారణ ప్రారంభించారు నాగర్‌ కర్నూల్‌ సీఐ కనకయ్య. ఆ కానిస్టేబుల్స్ డబ్బులు వసూలు చేసినట్లు నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని సీఐ కనకయ్య స్పష్టం చేశారు. ఈ విషయం తెలిసి బిజినేపల్లి ప్రజలు భగ్గుమంటున్నారు. పోలీసులు మరీ ఇంత దిగజారిపోయారేంటని చర్చించుకుంటున్నారు. ఇదొక్కటే కాదు.. పోలీసులు డబ్బులు డిమాండ్ చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు. సదరు కానిస్టేబుళ్ల బాధితులు చాలామంది ఉన్నారని అంటున్నారు. పోలీసు శాఖ ఉన్నతాధికారులు స్పందించి కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!