ఐ డ్రీమ్ జర్నలిస్ట్ కు బెదిరింపు
- ఇంటార్వ్యూలు ఆపేయక పోతే హత్య చేస్తామని హెచ్చరిక
- పోలీసులకు ఫిర్యాదు చేసిన మురళీధర్
- అర్బన్ నక్సలైట్ వాల్ పోస్టర్ పంపిన అగంతకుడు
నిర్దేశం, హైదరాబాద్ :
ఆయన నిజాయితీగా ఇంటార్వ్యూలు చేసే సీనియర్ జర్నలిస్ట్ బలివాడ మురళీధర్. మైక్ పట్టుకుని ప్రశ్నలను సందిస్తే తుపాకి తూటల్లా దూసుకువెళుతాయి. తనదైన శైలిలో నవ్వుతూ ప్రశ్నలతో సమాధానాలను రాబట్టే మురళీధర్ ను హత్య చేస్తామని అగంతకుడు ఫోన్ చేసి బెదిరించడం సంచలనం సృష్టించింది.
మురళీధర్ ఇంటార్వ్యూలు..
సీనియర్ జర్నలిస్ట్ మురళీధర్ చేసిన ఇంటార్వ్యూలన్నీ సంచలనమే.. తుపాకి గొట్టం ద్వారానే రాజ్యాధికారం చేపడుతామని ఏళ్ల తరబడి తుపాకి పట్టుకుని ఉద్యమాలు చేసి అలిసి పోయి జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ నక్సలైట్లను ఆయన ఇంటార్వ్యూ చేశారు. కుళ్లిన ఈ సమాజంలో దగ పడ్డ బాధితులకు అండగా నిలిచి ఇంటార్వ్యూలు చేశారు. శాంతి భద్రతల కోసం నిజాయితీగా విధులు నిర్వహించిన పోలీసు అధికారుల పనితనంపై ఇంటార్వ్యూ చేశారు.
ఇంతకు బెదిరించింది ఎవరో..?
జర్నలిస్ట్ మురళీధర్ ను బెదిరించింది ఎవరనే జర్నలిస్టు వర్గాలలో చర్చానీయంశంగా మారింది. ఇక ముందు ఇంటర్వ్యూలు ఆపేయాలని, స్క్రీన్ పైన కనిపిస్తే తగిన మూల్యం చెల్లిస్తావని అగంతకుడు ఫోన్ లో హెచ్చరించారు. ‘మీకేం కావాలి? మీరేవరు..? ఎందుకు నన్ను బెదిరిస్తున్నారు..?’ అని జర్నలిస్ట్ మురళీధర్ ప్రశ్నించగానే ‘త్వరలో యాక్షన్ చూస్తారు’ అని హెచ్చరించి ఫోన్ కట్ చేశాడు అగంతకుడు. అయితే.. ఆ అగంతకుడు అర్బన్ నక్సలిజంకు సంబంధించిన ఓ పోస్టర్ ను మురళీధర్ వాట్సాప్ కు పంపాడు.
పోలీసులకు ఫిర్యాదు..
ఫోన్ లో బెదిరించిన అగంతకుడి వివరాలతో జర్నలిస్ట్ మురళీధర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు బీఎన్ఎస్ 351(4) సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముందు జాగ్రత్తగా తాను ఎవరో తెలియకుండా ఉండటానికి ఇంటర్ నెట్ కాల్ క్యాలిఫోర్నియా అడ్రస్ తో ఫోన్ చేశాడు ఆ అగంతకుడు.
ఇంతకు బెదిరించింది ఎవరు..?
జర్నలిస్టు మురళీధర్ ను బెదిరించింది ఎవరో విచారణ జరిపించి కఠినంగా శిక్షించాలని జర్నలిస్టు సంఘాలు కోరుతున్నాయి. సివిల్ సర్వీస్ అధికారులను, రిటైర్డ్ ఆఫీసర్లను, జైలుకు వెళ్లి మారిన ఖైదీలను, మాజీ నక్సలైట్లను ఐడ్రీమ్ ద్వారా ఇంటర్వ్యూ చేసి ప్రజల మన్ననలు పొందారు. ఆయన చేసిన ఇంటార్వ్యూల వల్ల ఎవరికి నష్టమో అంతు పట్టడం లేదు. అర్బన్ నక్సలైట్ల కార్యకలపాలను అరికట్టడానికి వ్యూహంలో భాగంగా ఎవరైనా జర్నలిస్టు మురళీధర్ ను బెదిరించారనే టాక్ కూడా వినిపిస్తోంది. అర్బన్ నక్సలైట్ల పేరుతో ప్రత్యర్థి యూ ట్యూబ్ వాళ్లు బెదిరించి ఉంటారనే మరో టాక్ జర్నలిస్టు వర్గాలలో చర్చా ప్రారంభమైంది.
– యాటకర్ల మల్లేష్, 9394225111