అన్ని రంగాలలో మహిళల ప్రస్థానాన్ని, వారి స్థానాన్ని సమీక్షించాలి
నందిగామ, నిర్దేశం:
యూసఫ్ గూడా లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో , స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ప్రాంగణంలో మహిళా సాధికారత యాక్షన్ ప్లాన్ వర్క్ షాప్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి సీతక్క, సెర్ఫ్ సీఈవో దివ్యా దేవరాజన్ హజరయ్యారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు సమాన వేతనాలు ఉండాలన్న లక్ష్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం . మహిళల కష్టానికి తగిన ఫలితం ఉండాలన్నదే మహిళా దినోత్సవ ఆవిర్భావానికి కారణంగా నిలిచింది. భూగర్భం నుండి అంతరిక్ష రంగం వరకు అన్ని రంగాల్లో మహిళలకు అవకాశాలు రావాలి. మహిళల కష్టానికి తగిన ఫలితం దక్కినప్పుడే నిజమైన మహిళా దినోత్సవం. మహిళలు ఎంత ఎత్తుకు ఎదిగిన వివక్షత కొనసాగుతూనే ఉంది.
మహిళలు ఎమ్మెల్యేలు మంత్రులు ఐఏఎస్లు అయినా లైంగిక అసమానతలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఒకప్పుడు మహిళలకు వ్యవసాయం, పరిశ్రమలు మాత్రమే ఉపాధి మార్గాలు. కానీ ఇప్పుడు ఎన్నో రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు . అయినప్పటికీ మహిళల పట్ల సమాజంలో చిన్న చూపు పోవడం లేదని అన్నారు. ప్రతి రంగంలో మహిళల ప్రస్థానాన్ని, వారి స్థానాన్ని సమీక్షించాలి. లింగ సమానత్వం విషయంలో ఐక్యరాజ్యసమితి నిర్దేశించుకున్న లక్ష్యాలను ఎంత మేర మనం చేరుకోగలుగుతున్నామో ఆవలోకనం చేసుకోవాలి. మహిళలకు సమానత్వం, సమాన అవకాశాలు రావాలి. లింగ అంతరాలను తుంచితినే సమాజంలో సమానత్వం. శారీరకంగా మహిళలకు ఎన్నో ప్రతికూలతలు ఉన్నాయి. వాటన్నిటినీ అధిగమించి మహిళలు మందంజ వేస్తున్నారు. మహిళల ప్రతికూలతలను దృష్టిలో ఉంచుకొని విధానాల రూపకల్పన జరగాలి. ఆదిశలో ప్రజా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. మహిళా అనుకూలంగా అత్యుత్తమ విధానాన్ని రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. అనుభవజ్ఞులంతా సలహాలు సూచనలు చేస్తే, అనుగుణంగా నూతన విధానాన్ని రూపొందిస్తాం. లింగ సమానత్వాన్ని సాధించడంలో మహిళా సంఘాల పాత్ర గణనీయంగా ఉంది. మహిళా సంఘాలు మహిళలకు ఆర్థిక రక్షణతో పాటు సామాజిక భద్రత కల్పిస్తున్నాయి. అన్ని రంగాల్లో మహిళలకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. పెట్రోల్ పంపులు, ఆర్టీసీ అద్దె బస్సులను మహిళా సంఘాలకు కేటాయిస్తున్నాం. అదా నీ అంబానీలకి ఫలితమైన సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఆడబిడ్డలకు అందిస్తున్నాం. త్వరలో మరిన్ని వ్యాపారాల్లోకి మహిళా సంఘాలను ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాం. ఏడాది అనుకున్న లక్ష్యాలకు మించి మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించామని అన్నారు.