టాయిలెట్స్ కడగమన్నారు లెక్చరర్..
పీహెచ్ డీ సాధించిన దళిత యువతి
‘‘కౌశల్ పన్వర్ ఎవరు..?’’ అంటూ సంస్కృత అధ్యాపకుడు ప్రశ్నించాడు.
నేను సార్..’’ అంటూ ఆ అమ్మాయి లేచి నిలబడింది.
‘‘సంస్కృతం నీకెందుకు.. మీ వృత్తి టాయిలెట్స్ కడగడమే కదా.. వెళ్లి అదే పనిచేసుకో..’’ అని కఠినంగా అధ్యాపకుడు చెప్పడంతో పన్వర్ కళ్లలో నీళ్లు తిరిగాయి.
అయినా ఎదురు చెప్పకుండా కూర్చొంది. భారతీయ సమాజంలో వేళ్లూనుకున్న కులతత్వానికి ఈ సన్నివేశం ఒక ఉదాహరణ మాత్రమే.
వివరాల్లోకి వెళ్తే..
హరియాణా కైథల్ జిల్లా రాజౌండ్ గ్రామంలోని దళిత కుటుంబానికి చెందిన కౌశల్ పన్వర్ ఏడో తరగతికి చేరుకుంది. అక్కడ సాధారణ సబ్జెక్టులతో పాటు మరో సబ్జెక్టును ఐచ్ఛికంగా తీసుకోవాలి.
హోమ్‌సైన్స్, సంగీతం, సంస్కృతం.. ఇలా ఉంటాయి. ఆ విద్యార్థిని సంస్కృతాన్ని ఐచ్ఛికంగా తీసుకొంది. అదే ఆమె చేసిన పెద్దతప్పులాగా అధ్యాపకుడు ఆమెను హేళన చేయడం బాధించింది.
సంస్కృతం అంటే కేవలం అగ్రవర్ణాలు మాత్రమే అభ్యసించాలని అతని అభిప్రాయం. కానీ ఏదైనా అంశాన్ని విమర్శించే సమయంలో దాని గురించిన సమగ్ర సమాచారం తెలిసి వుండాలన్నదే కౌశల్ ఆలోచన. కులం పేరుతో చేసే హేళనలు, అవమానాలు భరించిన ఆ విద్యార్థిని దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన జవహర్‌లాల్‌నెహ్రూ యూనివర్సిటీ నుంచి సంస్కృతంలో పీహెచ్‌డీ పట్టా పొందింది. దిల్లీలోని మోతీలాల్‌నెహ్రూ కళాశాలలో సంస్కృత అధ్యాపకురాలిగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తోంది.
అడుగడుగునా అవమానాలు..
పన్వర్ చిన్నతనం దుర్భర దారిద్య్రంలో గడిచింది. సొంత గ్రామంలో అగ్రవర్ణాల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో దళితవాడలో ఎలాంటి సౌకర్యాలు లేకుండా బాల్యం గడిచింది. చిన్నప్పుడు తోటి స్నేహితురాళ్లతో కలిసి చెరువులోకి దూకితే అగ్రవర్ణాలకు చెందిన అమ్మాయిలు చెరువు పాడైపోయిందని ఆవేదన వ్యక్తంచేశారట. అలా బాల్యం నుంచి అవమానాలు ఎదుర్కొన్న పన్వర్ పట్టుదలతో అగ్రవర్ణాలకు ప్రత్యేకమైన పాఠ్యాంశంగా భావించే సంస్కృతంలో పట్టాపొందడం విశేషం.
ఆమిర్‌ఖాన్ ప్రశంస…
ప్రముఖ నటుడు ఆమిర్‌ఖాన్ నిర్వహించే ‘సత్యమేవజయతే’ కార్యక్రమంలో కౌశల్ పాల్గొన్నారు. తనకు రోజు అనేక మంది ఫోన్‌కాల్స్ చేస్తుంటారని అంటరానితనంపై పోరాటానికి సంఘీభావం ప్రకటిస్తున్నారని ఆమె తెలిపారు. కొంతకాలం క్రితం త్రివేండ్రానికి చెందిన దళిత ప్రొఫెసర్ ఫోన్ చేసి తాను ఇంతకాలం తన కులాన్ని బయటపెట్టలేదని కానీ పన్వర్ జీవన పోరాటాన్ని చదివిన అనంతరం తాను ఫలానా కులానికి చెందినవాడినని గర్వంగా ప్రకటించుకున్నానని తెలిపారు. ఈ ధైర్యం రావడానికి కారణమైన ఆమెకు కృతజ్ఞతలు తెలిపినట్టు వెల్లడించారు. ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఎన్ని ఇబ్బందులు ఎదురయినా దాన్ని సాధించిన కౌశల్‌కు ఆమిర్‌ఖాన్ అభినందనలు తెలిపారు.
– ఆకుల సుదర్శన్ ఫేస్ బుక్ నుంచి..