Take a fresh look at your lifestyle.

పదవుల ఖరారులో తుది నిర్ణయం హైకమాండ్ దే.

0 53

అంతా అధిష్ఠానం కనుసన్నల్లోనే..

  • పదవుల ఖరారులో తుది నిర్ణయం హైకమాండ్ దే.
  • రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వని వైనం
  • ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారులో బహిర్గతం

(ముస్కు హన్మంత్ రెడ్డి, జర్నలిస్ట్)

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడం రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీయులుగా ముద్ర పడిన ఇద్దరి పేర్లు దాదాపు ఖరారైన తరువాత చివరి నిమిషంలో ఒకరి పేరు మారడం వివిధ రకాల చర్చకు దారి తీసింది.

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బలూమూరి వెంకట్ పేర్లు ఖరారయ్యాయని, నామినేషన్ వేయడానికి సిద్దంగా ఉండాలని అధిష్ఠానం సూచించినట్లు ప్రచారం జరిగింది. వీరిద్దరు రేవంత్ వర్గీయులుగా ముద్రపడింది.

telangana-congress-1

రేవంత్ రెడ్డి వర్గీయుల పేర్లు ఖరారు కాగానే వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో మెరుగైన ఫలితాలు సాధించడానికి సీఎంకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కానీ.. మరుసటి రోజే అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డికి బలమైన మద్దతు దారుడిగా ఉన్న అద్దంకి దయాకర్ కు బదులుగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ పేరును అధిష్టానం ఖరారు చేసింది.

మొదట అద్దంకి దయాకర్, బీసీ నేత మహేశ్ కుమార్ గౌడ్ పేర్లు ఖరారు అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. మరుసటి రోజు మహేశ్ కుమార్ గౌడ్ స్థానంలో బల్మూరి వెంకట్ పేరు ఖరారైనట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ.. అనూహ్యంగా అద్దంకి దయాకర్ కాకుండా మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ పేర్లను అధిష్ఠానం ప్రకటించింది.

అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు. ఆయన తుంగతుర్తిలో రెండు సార్లు పోటీ చేసి ఓడి పోయారు. పార్టీకి సానుకూల ఉన్న సమయంలో వేరే నాయకుడికి టికెట్ ఇచ్చారు. దయాకర్ కు పదవి రాకుండా ఎవరైనా అడ్డు పడ్డారా..? లేక సమతూకం పాటిస్తూ రేవంత్ రెడ్డి అనుచరుడికి ఒక్కరికే అవకాశం ఇచ్చారా.. అని పలువురు పలు విధాలుగా చర్చిస్తున్నారు.

అన్నిట్లో అధిష్ఠానం జోక్యం..

పాలన నుంచి పదవుల ఖరారు వరకు అంతా అధిష్ఠానం కనుసన్నలలోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే టికెట్ లు కూడా అధిష్ఠానమే ఫైనల్ చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థులకు కూడా ఖరారు చేసింది.

ఎట్టకేలకు మహేశ్ కుమార్ గౌడ్ కు పదవి

బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ కు పదవి వరించనుంది. విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర, జాతీయ అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన నాయకత్వంలో పని చేసిన విద్యార్థి నాయకులు ఆయా రాష్ట్రాలలో ఉన్నత పదవులలో ఉన్నప్పటికీ మహేశ్ కుమార్ గౌడ్ కు అదృష్టం కలిసి రాలేదు.

మొదటి సారి 1994లో డిచ్ పల్లి నుంచి ఆ తరువాత 2014లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడి పోయారు. 2004 ఎన్నికల సమయంలో డిఎస్ ను విభేదించి తెలుగు దేశంలో చేరినప్పటికీ, మళ్లీ కొంత కాలానికే సొంత గూటికి చేరారు. ఎన్ ఎస్ యు ఐ జాతీయ అధ్యక్షుడిగా పని చేసినందున అధిష్ఠానం పెద్దలతో సత్సంబంధాలున్నాయి. ఆ సంబంధాల వల్లే వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశాలు వచ్చాయి.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking