కుల బహిష్కరణకు పరిష్కారం ఎప్పుడు..?
ప్రేక్షక పాత్ర పోషిస్తున్న పోలీసు అధికారులు
– సీపీ కల్మేశ్వర్ కు ఫిర్యాదు చేసినా లాభం సున్నా..
– కుల బహిష్కరణతో కుటుంభీకులు ఆందోళన
– ప్రతీకార హత్యలు జరిగే ప్రమాదం..?
(యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్)
కుల బహిష్కరణ.. తప్పు చేశారని కులస్థులు విదించే శిక్ష.. ఆ శిక్షను తప్పించుకోవడం ఎవరితరం కాదు.. న్యాయ అన్యాయాలను ఆలోచించాల్సిన పోలీసులు కూడా కులస్థుల ముందు మౌనంగా ఉండాల్సిందే. కానీ.. బాధిత కుటుంబం మాత్రం ప్రతి క్షణం నరకం అనుభవించాల్సిందే. తరతరాలుగా వస్తున్న కుల పెద్దల పెత్తనంతో తప్పు చేయక పోయినా శిక్ష అనుభవించే సంఘటనలు కోకోల్లాలు.
కుల బహిష్కరణ.. కులస్థులు విదించే శిక్ష.. గ్రామ బహిష్కరణ సర్వసమాజ్ పెద్దలు విదించే శిక్ష.. వాళ్లు ఏది చెప్పితే అదే వేదం.. గ్రామీణ ప్రాంతాలలో తప్పు చేశారని కుల పెద్దలు లేదా సర్వసమాజ్ విదించే శిక్షలను తప్పించుకోవడం ఎవరి తరం కాదు. కుల పెద్దలపైనా లేదా సర్వసమాజ్ పెద్దల పైనా పోలీసులకు ఫిర్యాదులు చేసినా లాభం లేకుండా పోతుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో చట్టాలు వీరి ముందు వంగి సెల్యూల్ చేయాల్సిందే.
మౌనవ్రతంలో పోలీసులు..
ఇగో.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామంలో స్థల వివాదంలో మాల కులస్థులు ప్రభుత్వ గెస్ట్ లెక్చరర్ నరేందర్ కు కుల బహిష్కరణ విధించి నెలలు గడుస్తోంది. నిజామాబాద్ పోలీసు కమీషనర్ కల్మేశ్వర్ కు, ఆర్మూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ కు స్వయంగా వెళ్లి మాల కులస్థులు ‘కుల బహిష్కరణ’ విధించారని ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కుల బహిష్కరణను ఎత్తివేయక పోవడం విశేషం. కులబహిష్కరణ విధించిన మాల కులస్థులకు నోటీస్ లు పంపి పోలీసులు చేతులు దులుపు కోవడం వల్ల నరేందర్ కుటుంభీకులు ప్రతి రోజు శిక్ష అనుభవిస్తున్నారు.
ఇంటిలిజెన్స్ వ్యవస్థ ద్వారా సమాచారం తెలుసుకుని కుల బహిష్కరణ సమస్యను డీజీపీ, ఐజీపీ; డీఐజీ, సీపీ లాంటి పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోకుంటే నరేందర్ సమస్య ఇంకా జఠిలమైతుందని పేర్కొంటున్నారు విద్యావంతులు. ఇప్పటికైనా పోలీసు అధికారులు జోక్యం చేసుకోకుంటే పరువు, ప్రతి కార హత్యలు జరిగే అవకాశాలు ఉన్నయంటున్నారు వారు.
పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తే..?
లెక్చరర్ నరేందర్ కు విధించిన కులబహిష్కరణ ఎత్తి వేయడానికి పోలీసు అధికారులు ప్రత్యేక చొరవ చూపాల్సి ఉంది. భార్య భర్తల మధ్య వివాదాలు ఏర్పాడితే కౌన్సిలింగ్ ఇచ్చినట్లు కుల పెద్దలకు, నరేందర్ లకు మధ్యన కౌన్సిలింగ్ ఇప్పించి సమస్యను పరిష్కారించే అవకాశం ఉందంటున్నారు విద్యావేత్తలు.
సీపీ కల్మేశ్వర్ ప్రత్యేక చొరవ చూపక పోతే నరేందర్ కుటుంబానికి ఆత్మహత్య శరణ్యంలా మారిందంటున్నారు వారు. నెల రోజులుగా కుల బహిష్కరణ ఎత్తి వేయక పోవడం పోలీసుల వైఫల్యాలకు నిదర్శనంగా చెబుతున్నారు.
పోలీసు బాస్.. న్యాయం చేయండి..
విద్యావంతుడినైనా తమకు కులస్థులు బహిష్కరణ విధిస్తూ శిక్ష వేయడం వల్ల తాను తన తల్లి, సోదరులతో కూడా మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నరేందర్. కుల బహిష్కరణతో పిల్లలు సైతం మానసికంగా కృంగి పోతున్నారంటున్నారు ఆయన. విద్యార్థులకు విద్య బోధన చేసే లెక్చరర్ గా తాను కులస్థుల నిర్ణయాన్ని వ్యతిరేకించినందున అన్యాయంగా కుల బహిష్కరణ విధించారంటున్నారు నరేందర్. ఇప్పటికైనా పోలీసు అధికారులు కుల పెద్దలతో మాట్లాడి తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు.