హైదరాబాద్ లో ఉగ్రకదలికలు.. 16 మంది అరెస్ట్
హైదరాబాద్, మే 9 : : హైదరాబాద్‌లో మళ్లీ ఉగ్ర కదలికల కలకలం చోటుచేసుకుంది. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 16మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో భోపాల్ కు చెందిన 11 మంది, హైదరాబాద్ కు చెందిన ఐదుగురు ఉన్నారు. మధ్య ప్రదేశ్, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి 16మందిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, కత్తులు, అలాగే ఇస్లామిక్ జిహాదీ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.మధ్యప్రదేశ్ పోలీసులకు అందిన స్పష్టమైన సమాచారంతో ఈ దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది.
కొంత కాలంగా వీరు కొన్ని ఉగ్రవాద సంస్థల వ్యవహారాలపై ఆకర్షితులై.. ఆయా సంస్థల్లో చేరాలన్న పట్టుదలతో గ్రూపుగా ఏర్పడి హైదరాబాద్ నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనుమనిస్తున్నారు. గతంలో ఇలాగే హైదరాబాద్ నుంచి కొంత మంది సిరియా వెళ్లి ఐసిస్‌లో చేరే ప్రయత్నాలు చేసినట్లుగా ప్రచారం జరిగింది. కొంత మందిని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఎన్ఐఏ వంటి సంస్థలు పట్టుకున్నాయి. ఆ తర్వాత అంతర్జాతీయంగా ఐసిస్‌తో పాటుఇతర ఉగ్రవాద సంస్థలు బలహీనపడ్డాయి. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి కూడా ఇలాంటి వార్తలు తగ్గిపోయాయి.
హఠాత్తుగా ఇప్లుడు ఏకంగా పదహారు మందిని అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది.గత ఏడాది ఏప్రిల్‌లో ఐసిస్ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుడిని అరెస్ట్ చేశారు. పాతబస్తీకి చెందిన సులేమాన్ అనే ఐసిస్ సానుభూతిపరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐసిస్ కు మద్దతుగా, ఐసిస్ భావజాలాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడు. సులేమాన్ పేరుతో 20 సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు గుర్తించారు. ఐపీ అడ్రస్ ఆధారంగా పోలీసులు సులేమాన్ ను అరెస్ట్ చేశారు. దేశంలో ఐసిస్ కదలికల్ని నాలుగు రోజుల క్రితం గుర్తించాయి భద్రతా బలగాలు.
ఈనేపథ్యంలో హైదరాబాద్ లో సానుభూతిపరుడిని అరెస్ట్ చేయడం సంచలనం కలిగించింది. టెలిగ్రామ్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఐసిస్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. అమెరికాకు వ్యతిరేఖంగా ఐసిస్ తరుపున యుద్ధం చేయాలంటూ.. కామెంట్స్ పెడుతున్నాడు. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా దేశంలో ఐసిస్ మాడ్యూల్స్ ఉన్నాయన్న అనుమానంతో ప్రత్యేకంగా నిఘా పెట్టారు.ప్రస్తుతం జంట నగరాల్లో ఎలాంటి ఉగ్రవాద కదలికలు లేవని పోలీసులు చెబుతున్నారు. అరెస్ట్ అయిన వారంతా భోపాల్ నుంచి వచ్చిన వారేనని భావిస్తున్నారు. షెల్టర్ కోసమో లేకపోతే.. ఎవరి దృష్టి పడకుండా ఉండటానికో హైదరాబాద్ వచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే ఈ అంశాన్ని తేలికగా తీసుకోవాలని భద్రతా సంస్థలు అనుకోవడం లేదు. పూర్తి స్ధాయిలో నిఘా పెడుతున్నాయి. అంతర్గత భద్రత విషయంలో కేంద్రం ఎలాంటి చిన్న అనుమానం వచ్చినా ఎవర్నీ వదిలి పెట్టడం లేదు.