పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యపై
శ్రీ చైతన్య పాఠశాల ముందు కొనసాగుతున్న ఆందోళనలు
మేడ్చల్ లోని శ్రీ చైతన్య కళాశాలపై మూడో రోజు కూడా ఆగ్రహ జ్వాలలు చల్లారలేదు. ఫీజు కట్టలేదు అంటూ తోటి విద్యార్థుల ముందు ఆ పాఠశాల ప్రిన్సిపల్ రమాదేవి అవమానకరంగా మాట్లాడడంతో పదవ తరగతి విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్న ఇంకా ఆ పాఠశాల ముందు విద్యార్థి సంఘ నేతలు ఆందోళనలు చేపడుతూనే ఉన్నారు. మూడో రోజు బిఆర్ఎస్ వి నేతలు పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. పాఠశాలపై చర్యలు తీసుకోవాలంటే నినాదాలు. ఓ దశలో పాఠశాలలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ వి నేతలు మాట్లాడుతూ ప్రవేట్ విద్యాసంస్థలకు కాసులపై ఉన్న శ్రద్ధ నాణ్యమైన విద్యను అందించడంలో లేదని ఘాటుగా విమర్శించారు. ధనార్జనే దేయంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. సంఘటన జరిగి మూడు రోజులు కావస్తున్న విద్యాశాఖ అధికారులు మాత్రం పాఠశాల వైపు కన్నెత్తి చూడడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి శ్రీ చైతన్య పాఠశాల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రెండు రోజుల నుండి పాఠశాల బంద్
ఫీజు కట్టలేదని ప్రిన్సిపాల్ వేధించడంతో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది అన్న విషయం తెలుసుకున్న శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం మరుసటి రోజు నుండి పాఠశాలకు సెలవులను ప్రకటించారు. రెండు రోజుల నుండి పాఠశాల తెరుచుకోలేదు. అయితే కళాశాల వద్ద ఇంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నప్పటికీ విద్య శాఖ అధికారులు మాత్రం పాఠశాల వైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సంఘటన ఎలా జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదని పలు విద్యార్థి సంఘ నేతలు విమర్శిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే శ్రీ చైతన్య కళాశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.