ఆలయంలో చోరీ…అక్కాచెల్లెళ్లు అరెస్ట్
హైదరాబాద్, నిర్దేశం:
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ సమీపంలోని గురుమూర్తి నాగర్లోని శ్రీ వినాయక దేవాలయంలో విగ్రహాలు చోరీకి గురైన విషయం తెలిసిందే. ఈ విగ్రహాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అక్కచెల్లెలు స్వర్ణలత, పావని శివపార్వతుల విగ్రహాలు దొంగతనం చేశారు. కుటుంబంలో తరచూ ఒకరు చని పోతుండటంతో విగ్రహాన్ని ప్రతిష్టించాలని బాబా చెప్పారు. బాబా మాటలు విని దేవుడు విగ్రహాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. విగ్రహాలు కొనేందుకు డబ్బులు సరిపోకపోవడంతో గుడిలో విగ్రహాలు కాజేసేందుకు స్కెచ్ వేశారు. ఎస్ఆర్ నగర్లో ఉన్న ఒక గుడిలో శివ పార్వతల విగ్రహాన్ని చోరీ చేసి ఎత్తుకెళ్లారు. స్వర్ణలత, పావనీలను ఎస్ఆర్ నగర్ పోలీసు అరెస్టు చేశారు.
హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురుమూర్తి నాగర్లోని శ్రీ వినాయక దేవాలయం ఉంది. అర్చకుడు నవీన్ కుమార్ గత శనివారం ఉదయం ఆలయానికి వచ్చి పూజలు చేసేందుకు శివాలయ గర్భగుడి తలుపులు తెరిచాడు. రోజూ మాదిరిగానే పూజలు చేస్తూ వచ్చిన భక్తులకు అర్చనలు చేస్తూ గర్భగుడిలో భక్తుల చేత అభిషేకాలు చేయిస్తున్నాడు. ఉదయం 10 గంటల సమయంలో టిఫిన్ చేయడానికి వెళ్లి వచ్చిన పూజారికి శివాలయం గర్భగుడిలో ఉన్న పంచలోహ విగ్రహాలు కనిపించలేదు. దీంతో కంగారుపడ్డ పూజారి.. ఆలయ ఈఓ నరేందర్ రెడ్డికి సమాచారం అందించాడు. శనివారం రాత్రి ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయం లోపల ఉన్న శివ పార్వతుల పంచలోహ విగ్రహాలు చోరికి గురికావడంతో పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు.