మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికి ఆదర్శం
: మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ
మహబూబ్ నగర్ , మార్చి 19 : తెలంగాణ వంటి సెక్యులర్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ కమలా నెహ్రూ కాలనీలోని ఎస్ఎన్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం నాడు జరిగిన సబ్బండ వర్గాల ఆత్మీయ సమ్మేళనంలో హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీతో కలిసి పాల్గొన్నారు.
కుల మతాలకు అతీతంగా బీఆర్ఎస్ పార్టీ పాలన అద్భుతంగా కొనసాగుతోందని తెలిపారు. ఇంత సెక్యులర్ ప్రభుత్వంలో దేశంలో మరెక్కడా లేదని మంత్రి తెలిపారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ విక్రయిస్తూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు లేకుండా చేస్తుందని ఆయన విమర్శించారు. సమైక్య రాష్ట్రంలో మహబూబ్ నగర్ లో 15 రోజులకు ఒకసారి తాగునీళ్లు వచ్చేవని, అప్పన్నపల్లి రైల్వే గేట్ పడితే అత్యవసర వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లే వారి పరిస్థితి దయనీయంగా ఉండేదని, చదువులు పూర్తయ్యాక ఉద్యోగాలు లేక ముంబై, దుబాయ్ వలస వెళ్లాల్సిన దుస్థితి ఉండేదని మంత్రి గుర్తు చేశారు.
అప్పుడు కనీసం ఒక్క మైనారిటీ గురుకులం కూడా లేకుండేదన్నారు. ఇమామ్, మౌజమ్ లకు కనీసం వేతనాలు కూడా గత ప్రభుత్వాలు ఇవ్వలేదని. తెలంగాణ ఏర్పడిన తర్వాత వారి సమస్యలు తీరాయన్నారు. పట్టణంలో హజ్ హౌస్ నిర్మాణం చేస్తున్నామని, అనేక దర్గాలను అభివృద్ధి చేశామని మంత్రి వివరించారు. స్థానిక మైనార్టీ నాయకులకు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పదవి, డిసిసిబి చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులతోపాటు అనేక అవకాశాలు కల్పించామన్నారు.
అభివృద్ధిని అడ్డుకునేందుకు కులం మతం పేరిట కుట్రలు చేస్తున్న నేతలు చివరకు పరిశ్రమలను కూడా కాలుష్యం పేరిట విష ప్రచారం చేస్తూ అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. దివిటిపల్లి, అంబటిపల్లి, ఎదిర ప్రజలు బస్సుల్లో తిరుపతి వెళ్లి బ్యాటరీ పరిశ్రమను ప్రత్యక్షంగా పరిశీలించి వచ్చారని అక్కడ కనీసం ఎలాంటి కాలుష్యం లేదని వారే గుర్తించారని మంత్రి తెలిపారు. 30 ఏళ్ల కిందట నిర్మించిన లెడ్ ఆసిడ్ బ్యాటరీ పరిశ్రమలోనే కాలుష్యం లేకుంటే కాలుష్యాన్ని నిర్మూలించేందుకు నిర్మిస్తున్న లిథియం గిగా సెల్ పరిశ్రమలో ఎలా కాలుష్యం ఉంటుందని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ గంగా జమునా తెహజీబ్ కు తెలంగాణ ప్రతీక అని, లౌకిక వాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. విభిన్న మతాలు, భాషలు, రాష్ట్రాల ప్రజలు కలిసి జీవించే తెలంగాణలో గంగా జమునా తెహజీబ్ సంస్కృతి శతాబ్దాలుగా విలసిల్లుతోందని తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ దేశంలోనే అత్యంత అద్భుతంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. ఒకప్పడు ఎంతో వెనుకబడి ఉన్న మహబూబ్ నగర్ నేడు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పట్టణంలో రోడ్లు, మౌలిక వసతులను అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు.
రాష్ట్రానికి మంత్రి అయినా నిత్యం నియోజకవర్గ అభివృద్ధి పైనే ఆయన ధ్యాస పెడతారని హోం మంత్రి తెలిపారు. అత్భుతంగా పనిచేస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు అండగా ఉండాలని మహబూబ్ నగర్ ప్రజలకు ఆయన సూచించారు. కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఇంతియాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్, వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, జెడ్పీ కో ఆప్షన్ చైర్మన్ అన్వర్, బీఆర్ఎస్ నాయకులు ఎండీ హనీఫ్, ఇక్బాల్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.