ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం
హైదరాబాద్, నిర్దేశం:
ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని ముసాయిదా బిల్లుకు తుది మెరుగులు దిద్దాలని, న్యాయపర చిక్కులు లేకుండా చూడాలని సూచించారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినేట్ భేటీ కొనసాగుతోంది.
కాగా, మాల, మాదిగ, డక్కలి ఇలా తెలంగాణలో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. ఆ జాబితాలోని కులాలకు ప్రభుత్వ విద్య, ఉద్యోగాల్లో కొంత శాతం వరకు రిజర్వేషన్ ఉంటుంది. తెలంగాణలో అది 15 శాతం ఉంది. అంటే వందలో 15 ఉద్యోగాలు ఈ కులాలకు చెందిన వారికే ఇస్తారు. అయితే, ఆ జాబితాలోని కులాల మధ్య కూడా అసమానతలు ఉన్నాయి. అందులో కొన్ని కులాలు ముందున్నాయి, మరి కొన్ని కులాలు వెనుకబడి ఉన్నాయని ఆయా కులాల వారు చెబుతూ వచ్చారు. దీనివల్ల ఎస్సీలకు మొత్తంగా ఇచ్చిన రిజర్వేషన్లను కొన్ని కులాలే ఉపయోగించుకుని ముందుకు వెళ్తున్నాయనీ, మిగతా వారు వెనుకబడే ఉంటున్నారనీ ఇతర కులాల వారు ఆరోపిస్తూ వస్తున్నారు.
అందుకే ఎస్సీలకు ఇచ్చిన 15 శాతం రిజర్వేషన్‌ను తిరిగి, కులాల మధ్య విభజించి పంచాలనే డిమాండ్ వినిపించింది. ప్రధానంగా రిజర్వేషన్ ఫలితాలు మాలలు వారు ఎక్కువ అనుభవించారు కాబట్టి, ఎస్సీ కులాలను వర్గీకరణ జరపాలంటూ మాదిగలు పోరాడారు మందకృష్ణ మాదిగ తెలుగునాట ఆ పోరాటంలో ముందు ఉండి అందరిని నడిపించారు.