నిర్దేశం, హైదరాబాద్: లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడిని చూస్తే ఎవరికైనా ఇదే ఆలోచన వస్తుంది. కొద్ది రోజుల క్రితం వరకు మంత్రిగా కూడా పని చేసిన తేజ్ ప్రతాప్ కు.. నిజానికి రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏ కోశాన కనిపించవు. చిత్రవిచిత్రమైన వేషాలతో తనలోని నటనా పటిమను తేజ్ ప్రతాప్ ప్రదర్శించినప్పటికీ సొంత కుటుంబీకులే పట్టించుకోకపోవడం శోచనీయం. ఇది పక్కన పెడితే, సామాజిక లక్ష్యం లేనివారు, రాజకీయ చింతన లేని వారి వల్ల ప్రజలకు ప్రయోజనం ఉండదు.
తేజ్ ప్రతాప్ యాదవ్‌కు లేటెస్ట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో శివలింగానికి అతుక్కుని జలాభిషేకం చేశారు తేజ్ ప్రతాప్. సాధువులు చేస్తున్న ఈ సంప్రోక్షణలో ఆయన పూర్తిగా శివలింగానికి చుట్టేసుకుని కూర్చుంటే పంచామృతాలతో పూజారులు అభిషేకం చేశారు. ఇలాంటి ఫీట్లు చేయడంలో తేజ్ ప్రతాప్ కు మరొకరు పోటీ లేరు. ఉన్నట్టుండి మెడకు పాము చుట్టుకుని శివుడి అవతారంలో ఎక్కడో రాళ్ల మధ్య ధ్యానం చేస్తూ కనిపిస్తారు. మరొకసారి పిల్లనగ్రోవి ఊదుతూ ఆవును వెంటబెట్టుకుని వస్తున్న కృష్ణుడిలా కనిపిస్తారు.
మొదట్లో లాలూ కుమారుడిగా తేజ్ ప్రతాప్ పరిచయం అయినప్పటికీ.. ఇలాంటి వేషాల వల్ల ప్రస్తుతం ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కానీ, ఇలాంటి రాజకీయాల్లో ఉండడమే బాధాకరం. అంటే, ఆయనను విమర్శించట్లేదు సుమా. కాకపోతే, కళారంగంలో అవార్డులు పొందే ప్రతిభ రాజకీయాల్లో నలిగిపోతుందేనన్న అసంతృప్తితో చెప్తున్న మాటలివి. ఇంట్లో వాళ్లు గుర్తించకపోయినా, కనీసం ప్రజలైనా ఇలాంటి వారిని గుర్తించి, ఎన్నికల్లో సరైన తీర్పు ఇంటికి పంపిస్తే బాగుంటుందేమో ఆలోచించాలి.