నిర్దేశం, హైదరాబాద్: ప్రతిపార్టీకి ప్రతిపక్ష నేతలు ఉంటారు. అయితే, అన్ని పార్టీల ప్రతిపక్ష నేతలు వేరే పార్టీలో ఉంటారు. కానీ, కాంగ్రెస్ పార్టీకి అయితే సొంత ఇంట్లోనే ప్రతిపక్ష నేతలు ఉంటారు. బహుశా.. కొట్టకున్నా, తిట్టుకున్నా మేమేనన్న మమకారం కాబోలు. అయితే, ఈ కారం ఒక్కోసారి పచ్చిమిరపకాయ కంటే ఘాటుగా నాటుగా ఉంటుంది. ఉన్నమాట చెప్పాలంటే.. కాంగ్రెస్ కు వేరే పార్టీలో ఉన్న విమర్శకుల కంటే.. సొంత పార్టీలో ఉన్న విపక్ష నేతల వల్లే ఎక్కువ డామేజీ అవుతూ ఉంటుంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు. ఆయనే తీన్మార్ మల్లన్న.
కాంగ్రెస్ పార్టీని విపక్ష పార్టీల నేతల కంటే ఎక్కువ తీన్మార్ మల్లన్నే ఉతికి ఆరేస్తున్నారు. కాంగ్రెస్ లో చేరిన కొత్తలో కాస్త మెత్తగానే కనిపించినప్పటికీ, ఇప్పుడైతే లెఫ్ట్, రైట్ వేసుకుంటున్నారు. మల్లన్న తీరుకు కాంగ్రెస్ నొచ్చుకోవడం వేరు.. చిత్రంగా బీఆర్ఎస్, బీజేపీ కూడా పెదవి విరుస్తున్నాయి. కారణం.. విపక్ష పాత్ర కూడా మల్లన్నే తీసుకుంటే ఇక తామెందుకనే అసంతృప్తి ఎవరికైనా ఉంటుంది మరి. పాపం.. ప్రభుత్వంలో ఉన్నవారికైతే మల్లన్న కొరకరాని కొయ్యగా మారారు. విపక్ష నేతైతే రాచి రంపాన పెట్టేవారు. సొంత పార్టీవాడు కదా. అటు కక్కలేక, ఇటు మింగలేక.. కాంగ్రెస్ నేతలు అయోమయం అవుతున్నారు.
జీవో-29 మీద మల్లన్న తిరుగుబాటు
గ్రూప్-1 పరీక్షకు ముందు ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో-29 మీద విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇక విపక్షాలకు ఎలాగూ ఇది పండగే. అయితే, మల్లన్న కూడా విపక్షాల స్టాండే తీసుకోవడం గమనార్హం. రేవంత్ ప్రభుత్వం చేస్తున్నది తప్పని చెప్పడమే చాలా ఎక్కువ అంటే.. ఓసీలకు గంపగుత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు కట్టబెట్టనీకి ఈ జీవో తెచ్చారని మల్లన్న తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక అప్పటి నుంచి ప్రభుత్వం మీద ఒంటి కాలు మీద లేస్తూనే ఉన్నారు. వేరే పార్టీ నుంచి వచ్చే మంటైనా అంతగా ప్రభావం చూపదు కానీ, సొంత పార్టీ నుంచి వచ్చే చిన్న పొగైనా ఊపిరాడనివ్వదు.
కేసీఆరే గెలిపించారని చెప్పి కాంగ్రెస్ ను జీరో చేశారు
మల్లన్న ఎమ్మెల్సీగా పోటీ చేసింది కాంగ్రెస్ టికెట్ మీద. అయితే తనను ఎమ్మెల్సీగా గెలిపించిందని కేసీఆరేనని మల్లన్న చెప్పడం గమనార్హం. మల్లన్న ఆ మాట చెప్పిన సందర్భం ఏదైనా కావొచ్చు. అసలే.. ప్రతి ఒక్కరి చేతిలో ఎడిటింగ్ అందుబాటులో ఉన్న సందర్భం ఇది. ఈపాటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. కాంగ్రెస్ కు పుండు మీద కారం చల్లినట్టైంది. పైగా, రేవంత్ ప్రభుత్వానికి రెడ్డి ప్రభుత్వమనే పేరు పోయింది. ఇక మల్లన్న ఈ రెడ్డి ట్యాగ్ మీద కూడా దాడి చేస్తున్నారు. తనకు రెడ్లు, ఓసీల ఓట్లు ఒద్దని, బీసీల ఓట్లు చాలంటూ మల్లన్న చేస్తున్న ప్రచారం.. బీసీలను ఐక్యం చేయడం అటుంచితే.. కాంగ్రెస్ మీద బీసీలకు తీవ్ర వ్యతిరేకతను పెంచుతోంది.