సుప్రీంకోర్టు సంచలన తీర్పు
– ఎలక్టోరల్ బాండ్లు చెల్లుబాటు కాదు
– అవి తిరిగి ఇవ్వాల్సిందే..
నిర్దేశం, న్యూఢిల్లీ :
ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అని తేల్చి చెప్పింది. ఆర్టికల్ 19(1)(ఏ)తో పాటు సమాచార హక్కు చట్టానికి ఇవి విఘాతం కల్గిస్తున్నాయని స్పష్టం చేసింది.
ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది. నల్లధనం నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్స్ ఒక్కటే మార్గం కాదని వెల్లడించింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం క్విడ్ ప్రోకోకి దారి తీస్తుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఇది కచ్చితంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని స్పష్టం చేసింది. ఎలక్టోరల్ బాండ్‌లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై విచారణ పూర్తైన సందర్బంగా ఈ తీర్పు వెలువరించింది.
ఈ బాండ్స్‌ని విక్రయించకూడదని ఆదేశించింది. విరాళాలిచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచడం తగదని మందలించింది. ఎన్నికల కమిషన్, SBI తమతమ వెబ్‌సైట్‌లలో ఈ వివరాలు పొందుపరచాలని తేల్చి చెప్పింది ధర్మాసనం. పార్టీలకు వచ్చిన నిధులు ఎవరు ఇచ్చారో తెలియాలని వెల్లడించింది. 2018లో జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్లు స్కీమ్ ని తీసుకొచ్చింది. రాజకీయ పార్టీకి కానీ… ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులకు కానీ విరాళాలు అందించాలంటే ఈ బాండ్‌లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఈ బాండ్‌ల ద్వారానే ఆయా పార్టీలు లేదా వ్యక్తులు విరాళాలు తీసుకోవచ్చు. బ్లాక్ మనీని అడ్డుకునేందుకు ఈ స్కీమ్ తీసుకొచ్చామని కేంద్రం చెప్పినప్పటికీ కొందరు దీన్ని సవాల్ చేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వీటిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఇలా తీర్పునిచ్చింది. 2019 నుంచి ఇప్పటి వరకూ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా రాజకీయ పార్టీలకు ఎంత మేర విరాళాలు వచ్చాయో లెక్కలన్నీ వెల్లడించాలని SBIని సుప్రీంకోర్టు ఆదేశించింది. మార్చి 13వ తేదీలోగా అన్ని వివరాలూ బయట పెట్టాలని స్పష్టం చేసింది.