మహిళలకు స్పెషల్ ఆఫర్…తక్కువ ధరలో ఆటోలు
హైదరాబాద్, నిర్దేశం:
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గణనీయంగా పెరుగుతోంది. సులభంగా డ్రైవింగ్ చేసే వీలుండడంతో మహిళలు సైతం వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఎలక్ట్రిక్ ఆటో డ్రైవర్లుగా మహిళలు సైతం పని చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఒమేగా సెకిల మొబిలిటీ కంపెనీ మహిళల కోసం ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చింది. మహిళా డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పింక్ ఆటో రిక్షాలను చాలా తక్కువ ధరకే ఇస్తామని ప్రకటించింది. మహిళా డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా పింక్ ఆటో రిక్షాలను రూపొందిస్తున్నట్లు ఒమేగా సెకీ పేర్కొంది. దేశవ్యాప్తంగా మహిళా డ్రైవర్ల కోసం 2500 ఎలక్ట్రిక్ పింక్ ఆటో రిక్షాలను తక్కువ ధరలకే దశల వారీగా అందించనున్నట్లు తెలిపింది. తమ కంపెనీ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఈ పథకాన్ని ఢిల్లీలో ప్రారంభించినట్లు ఒమేగా సెకి తెలిపింది. అలాగే మహిళలకు ప్రభుత్వ బ్యాంకు నుంచి వెహికల్ లోన్ తీసుకుంటే వడ్డీలోనూ 1 శాతం రాయితీ సైతం లభిస్తుందని కంపెనీ తెలిపిందిమహిళా డ్రైవర్లకు తక్కువ ధరకే ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలను అందించేందుకు తాము ఢిల్లీకి చెందిన లాభాపేక్ష లేని నారీ శక్తి సంస్థతో కలిసి పని చేస్తున్నామని ఒమేగా సెకి వ్యవస్థాపకుడు, ఛైర్మన్ ఉదయ్ నారంగ్ తెలిపారు. కొన్ని నెలల్లో ఈ పథకాన్ని బెంగళూరు, ఉత్తర కర్ణాటక, చైన్నల్లోనూ అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే ఎంపిక చేసిన మహిళలకు డ్రైవింగ్‌లోనూ శిక్షణ ఇస్తామని, దీని ద్వారా మహిళలకు స్థిరమైన జీవనోపాధి కల్పిస్తామని ఆయన తెలిపారు.మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రిక్ పింక్ ఆటో రిక్షా ధర ఢిల్లీలో ఆన్ రోడ్ ధర రూ.2,59,999గా ఉన్నట్లు ఒమేగా సెకి తెలిపింది. దీని కోసం ప్రభుత్వ బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే 1 శాతం వడ్డీ రాయితీ సైతం లభిస్తుందని పేర్కొంది. సంప్రదాయ సీఎన్జీ ఆటో రిక్షాలతో పోలిస్తే ఈ సరికొత్త పింక్ ఆటోల నిర్వహణ ఖర్చు పావు వంతు మాత్రమే ఉంటుందని తెలిపింది. ఈ ప్రత్యేక కార్యక్రమం ముఖ్యంగా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలనే లక్ష్యంలో భాగంగా చేపట్టినట్లు కంపెనీ తెలిపింది. ముఖ్యంగా అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని మహిళలకు స్థిరమైన ఆదాయం వచ్చే జీవనోపాధి కల్పించాలని తక్కువ ధరకే ఆటోలు ఇస్తున్నట్లు పేర్కొంది.