వాట్సాప్ డీపీ మార్ఫింగ్..
ఇన్‌స్టాలో ఫోటోలు వైరల్.. ఇద్దరు యువతుల సూసైడ్
సోషల్ మీడియా.. లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తోంది. ఇష్టమున్నోడు.. ఇష్టమున్నట్లు రాసుకుంటున్నాడు.. మరో అడుగు ముందుకు వేసి ఫోటోలను మార్పింగ్ చేసి ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటుండ్రు. ఇగో.. నల్గొండ జిల్లాలో వందేళ్లు బతుకాల్సిన ఇద్దరు యువతులు సోషల్ మీడియాకు బలయ్యారు.
నిర్దేశం, నల్గొండ : నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆత్మహత్యకు యత్నించిన ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది ఆకతాయిలు.. తమ వాట్సాప్ డీపీలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారనే మనస్తాపంతో నల్గొండలోని రాజీవ్ పార్కులో ఇద్దరు యువతులు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
అనంతరం పార్కు గేటు బయట ఉన్న ఓ చెట్టు కిందకు వచ్చి పడిపోయారు. గమనించిన స్థానికులు యువతులిద్దరిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఆ ఇద్దరు మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.