వెనక్కి తగ్గని స్మితా సబర్వాల్

వెనక్కి తగ్గని స్మితా సబర్వాల్

హైదరాబాద్, నిర్దేశం:
తెలంగాణలో సర్వత్రా వివాదాస్పదమైన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఏఐ ఫొటోను రీట్వీట్ చేసిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు తెలంగాణ పోలీసుల నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. పోలీసుల నోటీసులకు స్మితా సబర్వాల్ ఏ మాత్రం వెరవడం లేదు. పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తనదైన శైలిలో.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ట్వీట్లను వరుసగా రీట్వీట్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. కంచ గచ్చిబౌలి భూముల వివాదానికి సంబంధించి పలువురు రాజకీయ నేతలు, ఇతర వ్యక్తులు సోషల్ మీడియాలో చేసిన పోస్టులను డిలీట్ చేస్తున్నప్పటికీ, స్మితా సబర్వాల్ మాత్రం తన ట్వీట్‌ను తొలగించకపోగా.. ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా రీట్వీట్లు చేస్తూ.. తగ్గేదేలే అన్న సంకేతాన్ని ఇస్తున్నారు.

తాజాగా.. “ఒక స్త్రీ తనకోసం నిలబడే ప్రతిసారీ, ఆమె అందరు మహిళల కోసం నిలబడుతుంది..” అంటూ మాయా ఏంజెలో చెప్పిన సందేశాన్ని పోస్ట్ చేస్తూ ఓ మహిళా నెటిజన్ చేసిన ట్వీట్‌ని ఆమె రీట్వీట్ చేశారు. గతంలోనూ.. తాను చేసిన కొన్ని కామెంట్లు, పోస్టులు పెద్ద దుమారమే రేపినా.. ఏమాత్రం వెరవకుండా చివరివరకు తన మాట మీద నిలబడుతూ.. ఎదురైన ప్రతి సందర్భాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు.

కాగా.. ఇప్పుడు కంచ గచ్చిబౌలి భూముల విషయంలోనూ స్మితా సబర్వాల్ అదే ఆత్మస్ధైర్యాన్ని కనబరుస్తున్నారు.కాగా.. కంచె గచ్చిబౌలి వివాదంలో ఏఐ ఫొటోను షేర్ చేసినందుకు గానూ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేయగా.. అదే సందర్భంగా పలు ట్వీట్లను రీపోస్ట్ చేస్తూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. వాటిలో ముఖ్యంగా వంద ఎకరాల భూమిని పునరుద్ధరించాలంటూ సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన ఒక ఫొటో ఉంది. ఈ ఫొటోను రీట్వీట్ చేయడం ద్వారా ఆమె ప్రభుత్వం ఆ ఆదేశాలను పట్టించుకోవడం లేదని పరోక్షంగా విమర్శిస్తున్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా, మరొక పోస్ట్‌లో “తెలంగాణ పోలీసులు సొంత ఐఏఎస్ అధికారికే నోటీసులు ఇస్తారా? ఇది దేనికి సంకేతం?” అంటూ ఇద్దరు మహిళలు పెట్టిన ట్వీట్‌ను స్మితా సబర్వాల్ రీపోస్ట్ చేశారు. ఈ రీట్వీట్ పోలీసుల చర్యను ప్రశ్నించే విధంగా ఉంది.ఇదిలా ఉండగా.. ఏఐతో రూపొందించిన బుల్డోజర్లు, నెమళ్లు, జింకలు ఉన్న రెండు పోస్టులను స్మితా సబర్వాల్ గతంలో రీపోస్ట్ చేయడం వివాదాస్పదమైంది. ఈ పోస్టులకు వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ, ఆమె ప్రభుత్వ వ్యతిరేక ట్వీట్లను రీట్వీట్ చేయడం కొనసాగించడంపై ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిణి ప్రభుత్వంతో బహిరంగంగా విభేదించడం, పోలీసుల నోటీసులను సైతం లెక్కచేయకుండా వ్యవహరించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్మితా సబర్వాల్ తదుపరి చర్యలు ఎలా ఉండబోతాయో వేచి చూడాల్సి ఉంది.
ఏం చర్య తీసుకోవాలి…
స్మితా సభర్వాల్…తెలంగాణ ప్రభుత్వంలో పరిచయం అక్కర్లేని పేరు. బ్రిలియంట్  ఆఫీసర్ గా పేరున్న స్మితా సభర్వాల్..గత కేసీఆర్ సర్కార్ హయాంలో కీలక అధికారిగా… సీఎంవో లో పనిచేశారు. నాటి సీఎం కేసీఆర్ కు అత్యంత విశ్వాసపాత్రురాలిగా…పేరున్న అధికారి. ఉద్యమ సమయంలో మెదక్ జిల్లా కలెక్టర్ గా ఆమె పెట్టిన కన్నీళ్ళే..తెలంగాణ వ్యాప్తంగా ఆమెకు బ్రాండ్ ను తెచ్చాయి. ఆ కన్నీళ్ళే..కేసీఆర్ సర్కార్ లో స్మితకు కీలక శాఖలు దక్కేలా చేశాయి. సీఎం సెక్రటరీగా ఎంట్రీ ఇచ్చిన స్మితా సభర్వాల్… కేసీఆర్ కోటరీలో అత్యంత కీలకంగా మారిపోయారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్, మిషన్ భగీరథలకు పనిచేస్తూ..కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ప్రత్యేక పర్యవేక్షణ అధికారిగా స్మిత పనిచేశారు. ఇలా తొమ్మిదిన్నరేళ్లు… స్మితా సభర్వాల్ కేసీఆర్ సర్కార్ హయాంలో ఓ వెలుగు వెలిగారు. దీంతో ఆమెకు ఎదురు చెప్పే అధికారే లేకుండా పోయారు.ఇక మేయిన్ మీడియాకు దూరంగా…సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండటం స్మితా స్టైల్. ఇలా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ఎక్స్, వాట్సాప్ ఇలా..సోషల్ మీడియాలో తన పోస్టులతో తీవ్ర దుమారం రేపడం స్మితా సభర్వాల్ స్పెషల్. ఆమె కన్నీళ్ళ పోస్ట్ నుండి మొదలుకొని ట్రైనీ ఐఏఎస్ పూజా కేద్ కర్ నకిలీ వైకల్యం వెలుగులోకి వచ్చిన సందర్భంలో సివిల్ సర్వీస్ లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా? అంటూ ఆమె పెట్టిన పోస్ట్ తెగ వివాదాస్పదమైంది.అంతేకాదు గుజరాత్ లో బిల్కిస్ బానో పై లైంగికదాడికి పాల్పడిన దోషుల విడుదలపై స్మితా ట్వీట్ మరోసారి కాంట్రవర్సికి తెరతీశారు. అధికారిగా ఉంటూ..బీఆర్ఎస్ ఎజెండాతో ట్వీట్ చేస్తారా అంటూ….. గల్లీ నుండి..ఢిల్లీ వరకు బీజేపీ నేతల ఆగ్రహానికి గురైయ్యారు స్మితా.

ఇక సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినా..కనీసం కర్టసీకి కూడా…సీఎంను కలువకపోవడం..మంత్రి సీతక్క ముందు కాలుమీద కాలేసుకుని కూర్చోవడం నెట్టింట్లో తీవ్ర దుమారం రేపింది. ఇలా ఆమె అనేక విమర్శలను మూటకట్టుకున్నారన్న చర్చ సోషల్ మీడియాలో జరుగోతంది. ఇక ఎక్స్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లలో ఆమె పెట్టే టాటూస్ ఫోటోలు యమ ట్రెండింగ్ గా మారడంతో స్మితపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తిన సందర్భాలు కూడా ఉన్నాయనే చర్చ నడుస్తోంది.ఇక ఇప్పుడు కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సర్కార్, ప్రతిపక్షాల మధ్య పెద్ద పోరాటమే జరుగుతోంది. సెంట్రల్ వర్శిటీ భూములు అంటూ అక్కడ జింకలు, నెమళ్ళు ఉన్నాయంటూ..ఏఐ ఫోటోలను క్రియేట్ చేసి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం జరుగుతుంటూ సర్కార్ విమర్శలు గుప్పించింది. దీంతో ఆ ఫోటోలను పోస్ట్ చేసిన చాలామంది సెలబ్రీటీలు, పొలిటీషియన్స్ తర్వాత తొలగించారు. అయితే స్మితా సభర్వాల్ మాత్రం మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ హ్యాండిల్ పోస్టు చేసిన గిబ్లీ ఫొటోను రీపోస్ట్ చేశారుఅందులో మష్రూమ్ రాక్ ఎదుట భారీగా బుల్డోజర్లు ఉన్నట్లు…అలాగే వాటి ముందు నెమళ్లు, జింకలు ఉన్నాయి. ఈ పోస్టుని ఐఏఎస్ స్మితా సబర్వాల్ తన ఎక్స్ ఖాతాలో సేవ్ హెచ్ సీయూ అంటూ రీపోస్టు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఫేక్ ఫొటోగా తేల్చారు. దీంతో స్మితా సభర్వాల్ కు తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేయడం ఇప్పుడు హాట్ హాట్ గా మారింది.అయితే పోలీస్ నోటీసులు తనకు అందలేదు అంటూనే స్మితా సభర్వాల్ మరో పోస్టును రీట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు వంద ఎకరాలను పునరుద్దరించండి అంటూ ఉన్న ఆర్టికల్ ను రీట్వీట్ చేసి మండుతున్న అగ్గికి మరింత ఆజ్యం పోశారన్న చర్చ నడుస్తోంది. దీంతో ఇప్పుడు స్మితా వ్యవహారం ఐఏఎస్, పాలిటిక్స్ వర్గాల్లో తీవ్రం దుమారం రేపుతుందట. ఇలాంటి పోస్టులపై సీఎం రేవంత్ సీరియస్ గా ఉండటంతో ఇలా పోస్ట్ లు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది తమ పోస్ట్ లను తొలగించుకున్నప్పటికి స్మితా మాత్రం లైట్ తీసుకున్నారట. అంతేకాదు రీ ట్వీట్లతో మరింత హీటెక్కిస్తున్నారు.దాదాపు 20 ఏళ్లుగా ఐఏఎస్ సర్వీసులో ఉండి వివిధ శాఖల్లో కీలకంగా పనిచేసిన స్మితా సభర్వాలకు రూల్స్ కు విరుద్దంగా పోస్టులు చేస్తున్నారా? లేదా రూల్స్ కు లోబడే సామాజిక అంశాలను ఇలా స్రశిస్తున్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది. గతంలో కేసీఆర్, కేటీఆర్ కు అత్యంత విశ్వాసపాత్రురాలిగా పనిచేసిన స్మితా..ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కాంగ్రెస్ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్నాయి.ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులను ఆమె పట్టించుకోకపోవడంతో ఆమె వ్యవహారశైలి ప్రభుత్వ పెద్దలకు టార్గెట్ గా మారిందట. మరి ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ సర్కార్..స్మితా సభర్వాల్ వ్యవహారాన్ని ఎలా డీల్ చేయబోతుంది? దీనిపై స్మితా సభర్వాల్ ఏరకంగా ముందుకు వెళ్లనుందనేదే ఇప్పడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతుంది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »