రోజా వర్సెస్ షర్మిల

రోజా వర్సెస్ షర్మిల

విజయవాడ, నిర్దేశం:
వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల.. ఈ యుద్ధం మొదలై చాన్నాళ్లవుతోంది. ఈ గొడవలో వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ ఎవరివైపు నిలబడ్డారనే విషయం అందరికీ తెలిసిందే. ఆస్తుల గొడవ, కంపెనీ వాటాల గొడవ.. ఇతరత్రా వైరం కాస్తా చివరకు రాజకీయ వైరంగా మారింది. గతంలో వైసీపీని నిలబెట్టేందుకు అన్న జగన్ ని ముఖ్యమంత్రిని చేసేందుకు షర్మిల ఎంత కష్టపడ్డారో, గత ఎన్నికల్లో వైసీపీ పతనాన్ని ఆమె అంతగా కోరుకున్నారు. ఆ పంతం నెరవేర్చుకున్నారు. ఓటమి తర్వాత కూడా జగన్ తప్పుల్ని ఎత్తి చూపుతూ షర్మిల అనేక సందర్భాల్లో మీడియాతో మాట్లాడారు. తాజాగా ఆమె వివేకా హత్య కేసుని ప్రస్తావిస్తూ.. ఆయన కుమార్తె సునీతకు ప్రాణ హాని ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్‌ పై బయట ఉంటూ సాక్షులను బెదిరిస్తున్నారని ఆరోపించారు షర్మిల. వివేకా హత్య కేసులోని సాక్షులు ఒక్కొక్కరిగా ప్రాణాలు కోల్పోతున్నారని.. అధికారుల్ని కూడా అవినాష్ రెడ్డి బెదిరిస్తున్నారని చెప్పారు. పరోక్షంగా జగన్ పై కూడా ఆరోపణలు చేశారు షర్మిల.

ఇన్నాళ్లూ షర్మిల వ్యాఖ్యలకు వైసీపీ నుంచి పెద్దగా కౌంటర్లు ఉండేవి కావు. ఒకవేళ ఫ్యూచర్ లో అన్న, చెల్లెలు కలిసిపోతే తమ సంగతి ఏంటనే భయంతో చాలామంది వైసీపీ నేతలు షర్మిల వ్యాఖ్యలపై స్పందించేవారు కాదు. కానీ ఇప్పుడు తొలిసారిగా మాజీ మంత్రి రోజా, షర్మిల కామెంట్లపై కాస్త ఘాటుగా స్పందించారు. చంద్రబాబు చెప్పుచేతల్లో ఉన్న ఆమె జగన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అసూయ, ద్వేషంతో చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారి షర్మిల రాజకీయాలు చేస్తున్నారని అన్నారు రోజా. వివేకాను తామే చంపామని టీవీల్లో చెప్పినవారిని, అసలు హంతకులను అప్రూవర్లుగా మార్చి, వారికి బెయిల్ వచ్చేలా చేసి, వారిని నిరంతరం కాపాడుతున్నారని, హంతకుల్నే ఇప్పుడు హీరోలుగా చూపిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు మేలు చేయాలన్నదే షర్మిల తాపత్రయం అని, అదే ఆమె లక్ష్యం అని, ఆ విషయం ప్రజలకు పూర్తిగా అర్థమవుతోందని చెప్పారామె. చివరికి జగన్ ని ఇబ్బందిపెట్టడమే షర్మిల అసలు గమ్యం అని అన్నారు.
ప్రస్తుతానికి రోజా వ్యాఖ్యలను షర్మిల సీరియస్ గా తీసుకున్నట్టు లేదు. అయితే ఆ వెంటనే షర్మిల మరోసారి జగన్ ని టార్గెట్ చేస్తూ కౌంటర్లివ్వడం విశేషం. వివేకే హత్య కేసులో జగన్ ని పరోక్షంగా టార్గెట్ చేసిన ఆమె, సరస్వతి పవర్ షేర్ల బదిలీ విషయంలో అన్నను నేరుగా టార్గెట్ చేసి మాట్లాడారు. సొంత అమ్మకి బదిలీ చేసిన షేర్లను ఆయన తిరిగి అడుగుతున్నారని విమర్శించారు. తల్లిపై కేసు వేసిన కొడుకుగా.. మేనల్లుడు, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ చరిత్రలో మిగిలిపోతారన్నారు. జగన్‌కు విశ్వసనీయత ఉందో లేదో ఆ పార్టీ నేతలు ఆలోచించుకోవాలన్నారు.ఆస్తులు కాజేసిన మేనమామ అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్లు రెడీ చేస్తోంది. బహుశా ఆ బాధ్యతను పార్టీ నేతలు రోజాకు అప్పగించినట్టున్నారు. ఇప్పటికే చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అంటూ రోజా, షర్మిలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ రోజా వ్యాఖ్యలకు షర్మిల స్పందిస్తే అప్పుడు అసలు కథ మొదలైనట్టు. ఇప్పటి వరకూ లైటర్ వే లో ఉన్న వాగ్యుద్ధం ఇక చినికి చినికి గాలివానలా మారే ప్రమాదం ఉంది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »