కేసీఆర్ అప్పు చేశారు, రేవంత్ అదే తప్పు చేస్తున్నారు

– ఆర్థిక సమతుల్యత పాటించని రేవంత్ ప్రభుత్వం
– ఆదాయ మార్గాలు లేకున్నా ఉచితాలు అమలు
– ఓట్ల వేటలో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం

నిర్దేశం, హైదరాబాద్: ఆవు కంచె మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు ఉంది తెలంగాణ పరిస్థితి. ఉచిత పథకాల పేరుతో రాష్ట్రాన్ని ఇప్పటికే అప్పుల పాలు చేసింది గత కేసీఆర్ ప్రభుత్వం. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే తోవలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు నుంచే 6 గ్యారంటీలు అంటూ వరాలు కురిపించిన కాంగ్రెస్ పార్టీ.. తీరా అధికారంలోకి వచ్చాక వాటి అమలు కోసం నానా కష్టాలు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు పూర్తైంది. అప్పుడే అప్పులు చేయడం ప్రారంభించింది. ఇవీ సరిపోనట్టు ప్రభుత్వ భూములను అమ్మే ప్రణాళికలు సైతం వేస్తున్నారు. రేవంత్ రెడ్డి పాలన కూడా ఇలాగే ఉంటే గత కేసీఆర్ ప్రభుత్వంతో ఏమాత్రం తేడా లేనట్టే.

ఇబ్బంది పెడుతున్న 6 గ్యారెంటీలు
అధికారం కోసం నాయకులు ఏమైనా చెప్తారు. అర చేతిలో బడ్జెట్ లెక్కలు వేసి ఆకాశాన్ని నేలకు దింపుతామంటారు. తీరా అధికారంలోకి వస్తే కానీ తెలియదు. తాము నేల మీద ఉండే మాట్లాడుతున్నామని. కాంగ్రెస్ కూడా ఇలాగే చేసింది. ఆరు ఉచితాలు అంటూ ఎన్నికల సమయంలో జనాలను ఊదరగొట్టారు. ఇప్పుడవే ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. రాష్ట్రంలో ప్రణాళికేతర ఖర్చులు పోనూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు చిల్లి గవ్వైనా మిగలడం లేదు. కరెక్టుగా చెప్పాలంటే ఒక్క ఉచిత బస్సు గ్యారెంటీ తప్ప.. ఏదీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. కొన్ని ఇంకా ప్రారంభమే కాలేదు.

గత ప్రభుత్వంలోని పథకాల భారం
కేసీఆర్ ప్రభుత్వంలోని కొన్ని పథకాలు కాంగ్రెస్ మేనిఫెస్టోకి ఇబ్బందిగా మారాయి. రైతు బంధు, దళిత బంధు, కళ్యాణ లక్ష్మీ, ఉచిత కరెంటు వంటివి కొనసాగించాల్సి వస్తోంది. నిజానికి కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ఇవే పెద్ద అడ్డంకిగా మారాయి. ఒక విషయం చెప్పాలంటే, రాష్ట్ర ఖజానాకు అవే భారం అంటే, వాటిని పెంచి మరీ అమలు చేస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చారు. ఇప్పటికీ వాటిని పెంచడం అటుంచితే, ఉన్నవి సరిగా ఇచ్చేందుకు కిందా మీద పడాల్సి వస్తోంది.

అప్పుల వేటలో రేవంత్ సర్కార్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్ర ప్రజలపై రూ.6.5 లక్షల కోట్ల అప్పు భారం ఉంది. రాష్ట్ర ఏర్పాటుతో వచ్చిన అప్పు కాకుండా కేసీఆర్ ప్రభుత్వం రూ.6 లక్షల కోట్ల అప్పు చేసింది. అధికారంలోకి వచ్చిన కొత్తలో అసెంబ్లీలో కక్కిస్తాం, లెక్కిస్తాం అంటూ అధికార పార్టీ నేతలంతా దీనిపై బాగానే హడావుడి చేశారు. కానీ, నేటి పరిస్థితికి వచ్చే సరికే చేతులెత్తేశారు. విపక్ష నేతల నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా 6 గ్యారెంటీల మీద ఒత్తిడి వస్తోంది. దీనికి తోడు రైతు బంధు, కల్యాణ లక్ష్మీ, దళిత బంధు లాంటి పథకాలు మెడకు చుట్టుకున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందని ఎగిరిపడ్డ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇప్పుడు అప్పుల వేటలో మునిగిపోయింది. ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లోనే రూ.17,618 కోట్లు అప్పు చేసింది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!