ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం
* ప్రమాణం చేయించిన లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా
* రేఖా గుప్తాతోపాటు ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం
* ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, ధర్మేంద్ర ప్రదాన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తో సహా 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు
న్యూ డిల్లీ , నిర్దేశం :
దేశ రాజధాని ఢిల్లీలో 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కాషాయ జెండా రెపరెపలాడింది. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. నగరంలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రేఖా గుప్తా చేత లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణం చేయించారు.ఢిల్లీకి తొమ్మిదో సీఎంగా, నాలుగో మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా రికార్డు సృష్టించారు. అంతకుముందు సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిశీ ఢిల్లీ ముఖ్యమంత్రులుగా సేవలందించిన విషయం తెలిసిందే. ఇక, సీఎం రేఖా గుప్తాతోపాటు ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. పర్వేశ్ వర్మ, ఆశిష్ సూద్, మంజీందర్ సింగ్ సిర్సా, పంకజ్ సింగ్, కపిల్ మిశ్రా, రవీంద్ర ఇంద్రజ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.రామ్‌లీలా మైదానంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, ధర్మేంద్ర ప్రదాన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సహా 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, బీజేపీ నేతలు, వ్యాపార, సినీ ప్రముఖులు హాజరయ్యారు.అంతకుముందు సీఎం రేఖా గుప్తా తన నివాసం నుంచి భారీ ర్యాలీగా రామ్‌లీలా మైదానానికి చేరుకున్నారు. మార్గం మధ్యలో మార్గట్ వాలే బాబా టెంపుల్‌లో పూజలు చేశారు. ఇదిలా ఉండగా.. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా రామ్‌లీలా మైదానం వద్ద 25 వేల మందితో భారీ భద్రత ఏర్పాటు చేశారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రతను నిర్వహించారు.
ఎవరీ రేఖా గుప్తా?
ఢిల్లీకి కాబోతున్న నాలుగో మహిళా ముఖ్యమంత్రి రేఖా గుప్తా. ఇంతకుముందు సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, ఆతిశీ మహిళా సీఎంలుగా పని చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి బందన కుమారిపై 29 వేల ఓట్ల భారీ మెజారిటీతో షాలిమార్‌బాగ్ నుంచి రేఖా గుప్తా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఆమెకు ఇదే మొదటిసారి. విద్యార్థి దశ నుంచి ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ విద్యార్థి విభాగం ఏబీవీపీలో ఆమె చురుగ్గా పని చేశారు.1996లో ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో మూడుసార్లు కౌన్సిలర్‌గా, ఒకసారి మేయర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆమె బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. 1974లో హర్యానాలోని జింద్ జిల్లా నంద్‌గఢ్ గ్రామంలో రేఖా గుప్తా జన్మించారు. ఆమె తండ్రి ఎస్బీఐ అధికారిగా ఢిల్లీకి బదిలీ కావడంతో రేఖా గుప్తా కుటుంబం ఇక్కడ స్థిరపడింది.కాగా, ఇటీవలే జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ బీజేపీ 48 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెవరలేదు. ఈ ఎన్నికల్లో గెలుపుతో దాదాపు 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కమలం పార్టీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.