గర్భం కాని గర్భం…9 నెలల తర్వాత అసలు రహస్యం
రాజమండ్రి, నిర్దేశం:
అమ్మా.. అనే పిలుపు మహిళల జీవితంలో ఎంతో అమూల్యమైనది. అమ్మతనంతోనే తమ జీవితం పరిపూర్ణమవుతుందని ఎంతో మంది మహిళలు నమ్ముతారు. అయితే, ప్రస్తుతమున్న కాలంలో అమ్మతనం అనేది చాలా మంది మహిళలకు అంత సులువుగా దొరకట్లేదు. సంతానలేమి సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. పెళ్లైన ఎన్నో జంటలు సంతానం కోసం ఏళ్లపాటు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఇదే పరిస్థితి ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలానికి చెందిన ఓ మహిళకు ఎదురైంది. పెండ్లి జరిగి ఏళ్లు గడుస్తున్నా గర్భం దాల్చకపోవటంతో ఇరుగుపొరుగులు, ఇంట్లోవాళ్ల మాటలు భరించలేక ఆ మహిళ ఎవ్వరూ ఊహించని సాహసానికి ఒడిగట్టింది. దీంతో తొమ్మిది నెలలు మానసిక యాతన అనుభవించింది. దేవీపట్నం మండలంకు చెందిన జంటకు పెళ్లి జరిగి తొమ్మిదేళ్లు అయినా సంతానం కలగలేదు. దీంతో మహిళ సంతానలేమి కారణంగా సూటిపోటి మాటలు ఎదర్కోక తప్పలేదు. వారి మాటలను భరించలేక పోయిన మహిళ గర్భం దాల్చానంటూ అందరినీ నమ్మించింది. ప్రతినెలా భర్తతో కలిసి రాజమహేంద్రవరం ఆస్పత్రికి వెళ్లేంది.
భర్తను బయటే ఉంచి వైద్యురాలి వద్దకు వెళ్లేది. గర్భం దాల్చడానికి తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి మాట్లాడి వెళ్లిపోతుండేది. భర్తకు, అత్తింటిలోని వారికి మాత్రం వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు చెప్పేది.నెలలు గడుస్తుండటంతో గర్భిణిలా కనిపించేందుకు చీర లోపల ఒత్తుగా దుస్తులు అమర్చుకునేది. తొమ్మిది నెలలు నిండడంతో ఈనెల 3న భర్త, అత్తతో కలిసి రాజమహేంద్రవరం ఆసుపత్రికి ప్రసవం కోసమని వెళ్లింది. అక్కడ ఏం చేయాలో ఆమెకు పాలుపోలేదు. దీంతో ఆ మహిళ మరో కొత్త ప్లాన్ వేసింది. ఆస్పత్రి వద్దకు వెళ్లాక వెంటనే వస్తానని చెప్పి భర్త, అత్తకు దూరంగా వెళ్లింది. ఎంతసేపటికి భార్య రాకపోవటంతో ఆస్పత్రి వద్ద, చుట్టుపక్కల ప్రాంతాల్లో భర్త, అతని తల్లి వెతికారు. ఆచూకీ దొరక్కపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించిగా మహిళ ఓ ఆటోలో వెళ్లినట్లు గుర్తించారు. చివరకు కాకినాడలో ఉన్నట్లు తెలుసుకొని భర్త, అత్త అక్కడి వెళ్లి ఆమెను ప్రశ్నించారు. అక్కడ ఆస్పత్రిలో ప్రసవానికి భయపడి వచ్చేశానని.. స్నేహితురాలి సూచనతో ప్రసూతి కోసం కాకినాడ జీజీహెచ్ లో చేరగా, కవలలు జన్మించారని చెప్పింది. కానీ, పుట్టిన వెంటనే ఆ పిల్లలను ఎవరో ఎత్తుకెళ్లారని చెప్పింది. దీంతో అనుమానం వచ్చి పోలీసులు లోతుగా విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది.పెండ్లి జరిగి తొమ్మిదేళ్లు అయినా సంతానం లేకపోవటంతో ఇరుగుపొరుగులు, ఇంట్లో వాళ్ల మాటలు భరించలేక గర్భం దాల్చానంటూ మహిళ అబద్దం ఆడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అత్తింటివారికి, భర్తతోపాటు సదరు మహిళకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. అయితే, గర్భందాల్చకపోయినా లోకం నిందలకు భయపడి గర్భందాల్చినట్లుగా అందరినీ నమ్మించేందుకు ఆ మహిళ తొమ్మిదినెలలు మానసిక యాతన అనుభవించింది.