ఎమ్మెల్సీ కోసం రాములమ్మ….హస్తినకు ప్రయాణం

 ఎమ్మెల్సీ కోసం రాములమ్మ….హస్తినకు ప్రయాణం

హైదరాబాద్, నిర్దేశం:
తెలంగాణ రాజకీయాలలో రాములమ్మ తెరపైకి వచ్చారు. తన త్యాగాలను గుర్తుపెట్టుకొని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని నేరుగా ఆమె అధిష్టానం వద్దకే వెళ్లింది. ఎలాగైనా తనకు న్యాయం చేయాలని రాములమ్మ విజ్ఞప్తి చేయడంతో, కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఇదే పొలిటికల్ టాపిక్ గా మారింది. ఇంతకు రాములమ్మ ఎవరని అనుకుంటున్నారా.. రాములమ్మ సినిమాతో ప్రజల మదిలో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న నటి విజయశాంతి. సినీ రంగం నుండి రాజకీయ రంగంలోకి ప్రవేశించిన అనంతరం విజయశాంతి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ముందుగా తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు. ఆ తర్వాత అనూహ్య రాజకీయ పరిణామాల నేపతిమాలో బిజెపి కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో విజయశాంతి జాయిన్ అయ్యారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చారు విజయశాంతి. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ నుండి బిజెపికి లో చేరారు. గత ఎన్నికల ముందు విజయశాంతి బిజెపి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల సమయంలో తన వంతుగా ప్రచారాన్ని సైతం సాగించారు.ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నుండి పలు విమర్శలు వచ్చాయి.

ఆ సమయంలో విజయశాంతి గతంలో తాను ఏర్పాటుచేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్స్ ఖాతా ద్వారా పోస్ట్ చేసి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి మద్దతు తెలిపారు. అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులపై సీఎం రేవంత్ రెడ్డి మాటకు విజయశాంతి వత్తాసు పలికారు. తెలంగాణకు కనీసం నాలుగు అవార్డులైన ఇచ్చి ఉండాల్సిందని విజయశాంతి అభిప్రాయపడ్డారు.తాజాగా తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ 5 స్థానాలకు ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రణాళిక ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డాయి. బీఆర్ఎస్ కు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యకు ఒక ఎమ్మెల్సీ ఖాయమనే చెప్పవచ్చు. మిగిలిన 4 స్థానాలకు కాంగ్రెస్ నుండి అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇక్కడే విజయశాంతి అలియాస్ రాములమ్మ ఎమ్మెల్సీ సీటు నేరుగా ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసిన విజయశాంతి, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని ఢిల్లీ పెద్దలను కోరారని తెలుస్తోంది. పార్టీ కోసం తాను చేసిన త్యాగాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆమె కోరారట.అయితే అధిష్టానం మాత్రం ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదని, ఆమె విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్ మాత్రం కాంగ్రెస్ ను నమ్ముకున్న ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని, పార్టీ కోసం కష్టపడిన వారికి సుస్థిర స్థానం ఉంటుందని హామీ ఇస్తున్నారు. మొత్తం మీద రాములమ్మ ఎమ్మెల్సీ పదవి కోసం ఏకంగా ఢిల్లీ పెద్దలను కలవడంపై ప్రస్తుతం ఇదే టాక్ ఆఫ్ ది పొలిటికల్ గా మారింది. మరి రాములమ్మ కోరిక నెరవేరుతుందా? లేదా అన్నది మున్ముందు తెలియాల్సి ఉంది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »