కాంగ్రెస్ గూటికి పొంగులేటీ… కారణాలు అవేనా..

కాంగ్రెస్ గూటికి పొంగులేటీ…

కారణాలు అవేనా..

ఖమ్మం, జూన్ 9 : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పు దాదాపుగా ఖరారైంది. నేతలు, అనుచరులతో వరుస సమావేశాలు, వాళ్ల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా పొంగులేటి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. కుదిరితే ఈనెల 25న కాంగ్రెస్‌లో చేరనున్నట్టు తన అనుచరులకు సంకేతాలిచ్చారనే ప్రచారం జోరందుకుంది. పొంగులేటి రాజకీయ భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు పొలిటికల్ సర్కిల్స్‌లో షికారు చేశాయి.

ఈ క్రమంలో శుక్రవారం ఖమ్మంలో తన క్యాంప్ కార్యాలయంలో అనుచరులతో భేటీ కాబోతున్నారు పొంగులేటి. జిల్లావ్యాప్తంగా ఉన్న తన కేడర్‌కు ఇప్పటికే ఫోన్లు చేసి అందుబాటులో ఉండాలని సూచించారట. ఈ భేటీలోనే పార్టీ మార్పు, చేరికపై క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. ఈ నెల అందుకు సంబంధించిన ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ అమెరికా పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత ఢిల్లీలో జూన్ 21 న పొంగులేటి, జూపల్లి ఆయన్ను కలవనున్నారు.

బీఆర్‌ఎస్‌ను ఓడించాలనే లక్ష్యంతో ఇప్పటికే ఇతర పార్టీల నేతలు, వేర్వేరు సంఘాల నాయకులతో పొంగులేటి సమాలోచనలు జరిపారు. బీజేపీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా.. కొన్ని ఇబ్బందుల కారణంగా ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపలేదు. కర్నాటకలో కాంగ్రెస్‌ గెలుపుతో టీకాంగ్రెస్‌లో జోష్ పెరిగింది. పైగా ఖమ్మంజిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితులు, తన అనుచరుల మెజార్టీ అభిప్రాయం కాంగ్రెస్‌ వైపే ఉండటంతో పొంగులేటి ఆ పార్టీలోకి వెళ్లాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్‌లో చేరికకు సంబంధించి ముహూర్తంపైనే పొంగులేటి చర్చిస్తారని సమాచారం. ప్రస్తుతం భట్టి విక్రమార్క పాదయాత్ర ఖమ్మంలో కొనసాగుతోంది. ఆ పాదయాత్ర ముగింపు సభలో జాయిన్ కావడమా.. లేదంటే సొంతంగా బహిరంగ సభ నిర్వహించి అదే వేదికపై ప్రకటించడమా అన్నదానిపై స్పష్టతరానుంది. అలాగే రాహుల్ గాంధీ హాజరు అయ్యే అవకాశం ఉన్న ఈ బహిరంగ సభ, జన సమీకరణపై కూడా చర్చిస్తారట.

పొంగులేటి కాంగ్రెస్‌లోకి వస్తే.. పాలేరు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో తమ నేతల సీట్లు గల్లంతవుతాయా అన్న అనుమానం లోకల్‌ కార్యకర్తల్ని వెంటాడుతోంది. పదేళ్లుగా కాంగ్రెస్‌ అధికారంలో లేకపోయినా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని.. తీరా ఇప్పుడు తమ నేతలకు కాకుండా వేరే వాళ్లకి సీట్లు ఇస్తే ఎలా నిట్టూరుస్తున్నారట. కాంగ్రెస్‌ అధిష్టానం మాత్రం వర్గాల వారీగా టిక్కెట్లు ఉండవని.. సర్వేల ఆధారంగానే గెలుపు గుర్రాలకు అవకాశాలుంటాయని స్పష్టం చేసిందట. మొత్తానికి పొంగులేటి కాంగ్రెస్‌లో చేరిక ఓ వైపు జోష్ నింపుతుంటే.. మరోవైపు కొంతమంది నేతల అనుచరుల్ని కంగారెత్తిస్తోంది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!