పోలీసుల ఔదార్యం ఇంటర్‌ విద్యార్థిని సకాలంలో పరీక్షా సెంటర్‌ తీసుకెళ్లిన సీఐ, ఎస్‌ఐ

పోలీసుల ఔదార్యం
ఇంటర్‌ విద్యార్థిని సకాలంలో పరీక్షా సెంటర్‌ తీసుకెళ్లిన సీఐ, ఎస్‌ఐ

జనగామ, నిర్దేశం:

ఖాకీలంటే కాఠిన్యమే కాదు, కరుణను సైతం పంచుతారనే ఉదంతం జనగామలో చోటు చేసుకుంది. పోలీసులు సకాలంలో విద్యార్థినిని పరీక్ష కేంద్రానికి చేర్చి శభాష్‌ అనిపించుకున్నారు. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షకు హాజరు కావాల్సిన ఓ విద్యార్థిని జనగామ అర్బన్‌ పోలీసులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేర్చి తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు. సునీత అనే ఫస్టియర్‌ విద్యార్థిని పొరపాటున తను పరీక్ష రాయాల్సిన సెంటర్‌కు బదులు మరొక సెంటర్‌కు వెళ్లింది. ఈ క్రమంలో ప్రెస్టన్‌ కాలేజీ వద్ద విద్యార్థిని సునీత కంగారు పడుతున్న తీరును గమనించిన సీఐ దామోదర్‌ రెడ్డి, ఎస్‌ఐ చెన్నకేశవులు సదరు విద్యార్థినిని సకాలంలో తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ కాలేజీ సెంటర్‌కు పోలీసు వాహనంలో చేర్చారు. పోలీసులు స్పందించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. కాగా, ఇంటర్‌ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొత్తం మూడు గంటలపాటు పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులను కాస్త ముందుగానే సెంటర్‌లోకి అనుమతిస్తారు. విద్యార్థులు ఉదయం 8:45 గంటలలోపు సెంటర్‌లో ప్రవేశించడం ఉత్తమమని అధికారులు సూచించారు. ఆలస్యంగా వచ్చే వారిని అంటే 9:05 గంటల తర్వాత వచ్చే వారిని అస్సలు అనుమతించరు. బుధవారం ఫస్టియర్‌ విద్యార్థులకు రెండోభాష పేపర్‌-1కు పరీక్ష నిర్వహిస్తారు. గురువారం సెకండియర్‌ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,532 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫస్టియర్‌లో 4,88,448 విద్యార్థులు, సెకండియర్‌లో 5,08,523 విద్యార్థుల చొప్పున 9,96,971 విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. వీరిలో గతంలో ఫెయిలైన 67,735 మంది విద్యార్థులు కూడా పరీక్షలకు హాజరుకాబోతున్నారు. పరీక్షల కోసం 29,992 మంది ఇన్విజిలెటర్లు, 72 మంది ప్లయింగ్‌స్కాడ్‌, 124 సిట్టింగ్‌ స్కాడ్‌లకు విధులు కేటాయించారు. ఇంటర్‌బోర్డు అబ్జర్వర్లను (పరిశీలకులు) సైతం రంగంలోకి దించనున్నది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »