రిటైర్డ్ ఉద్యోగులకు తక్షణమే పెన్షన్ ను విడుదల చేయాలి

సీఎంకు  బండి సంజయ్ బహిరంగ లేఖ

గౌరవనీయులైన శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి
తెలంగాణ ముఖ్యమంత్రి,
ప్రగతి భవన్, హైదరాబాద్.

విషయం : రిటైర్డ్ ఉద్యోగులకు తక్షణమే పెన్షన్ ను విడుదల చేయాలని, ఉద్యోగులకు పీఆర్సీని ఏర్పాటు చేయాలని కోరుతూ….

నమస్కారం…

ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెప్పుకుంటున్న మీ ప్రభుత్వం అసలు వాస్తవాలు తెలుసుకుంటే మంచిది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులతోపాటు పెన్షనర్ల కుటుంబాలు ఎలా ఉన్నాయో.. ఎప్పుడైనా అడిగి తెలుసుకున్నారా.. ఉద్యోగులకు నెలనెలా సక్రమంగా జీతాలివ్వడం లేదు. రిటైర్డ్ ఉద్యోగులకు సైతం సకాలంలో పెన్షన్ ను ఇవ్వకపోవడం దారుణం. గత రెండు నెలలుగా చాలా జిల్లాల్లో రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వలేదు. రిటైర్డ్ ఉద్యోగులకు వ్రుద్దాప్యలో అనేక ఆరోగ్య సమస్యలుంటాయి. ఆసుపత్రులకు, మెడిసిన్, పౌష్టికాహారం కోసం డబ్బులు తప్పనిసరిగా అవసరమవుతాయి. ఇది తెలిసి కూడా వారికి పెన్షన్ సకాలంలో చెల్లించకపోవడం అమానవీయం.

ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ మీ పాలనా పుణ్యమా అని అప్పుల కుప్పగా మారింది. ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వడం లేదు. రిటైర్ అయిన ఉద్యోగులకు అదే రోజున రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పిన మీ మాట ప్రకటనలకే పరిమితమైంది. నెలల తరబడి రిటైర్డ్ ఉద్యోగులంతా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 460 మంది ఉద్యోగుల పెన్షన్ ఫైళ్లు ఆర్థికశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వేలాది మంది మంది రిటైర్డ్ ఉద్యోగులది ఇదే పరిస్థితి.

ఉద్యోగులు, పెన్షనర్ల హెల్త్ స్కీమ్‌ను నిర్వీర్యం చేసి, వారికి వైద్య సేవలు అందకుండా చేశారు. ప్రమోషన్లు, పోస్టింగుల్లో మీ వందిమాగదులను నియమించుకుని, అర్హులకు అన్యాయం చేశారు. మీ ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి ఎన్నో విలువైన సూచనలు చేసినా అమలు చేసిన దాఖలాల్లేవు. ఇదేనా ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే..?

ఈ నెలాఖరుతో మొదటి PRC గడువు ముగియబోతోంది. వచ్చే నెల నుండి కొత్త PRC అమల్లోకి రావాలి. కానీ ఇప్పటి వరుకు మీరు కనీసం PRC కమిషన్ ను నియమించకపోవడమంటే ఉద్యోగులను, ఉపాధ్యాయులను దగా చేయడమే. కొత్త పీఆర్‌సీ అసలు అవసరమే లేదని, ఉద్యోగులు, పెన్షనర్లు మీకు ఓటెయ్యరని మీరు మీ సన్నిహితులతో అన్నట్లుగా పత్రికల్లో వచ్చిన వార్తలు విస్మయానికి గురి చేస్తున్నాయి.

మీరు ఇచ్చే హామీలు, కొట్టే కొబ్బరి కాయలన్నీ ఓట్ల కోసమేనని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు‌. కానీ ఉద్యోగులు, పెన్షనర్ల విషయంలోనూ ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తుండడం బాధాకరం. ప్రజలచేత ఎన్నికైన ప్రభుత్వం ప్రజలందరి కోసం పని చేయాలన్నది ప్రజాస్వామ్యంలో ప్రాథమిక సూత్రమన్న విషయాన్ని మీరు పూర్తిగా విస్మరించారు. మీకు ఓట్లు, సీట్లే తప్ప ప్రజల బాగోగులు పట్టకపోవడం దుర్మార్గం. ఒకవేళ ఓట్ల కోణంలో ఆలోచించినా‌ పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల ఓట్లు రాష్ట్రంలో 30 లక్షలకు పైనే ఉన్నాయనే విషయాన్ని విస్మరించడం శోచనీయం.  తక్షణమే పెన్షనర్లందరికీ పెన్షన్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. తక్షణమే పీఆర్సీ వేసి ఉద్యోగులు, పెన్షనర్లు ఆశిస్తున్న విధంగా వేతనాలు, డీఏ పెంచాలని బీజేపీ తెలంగాణ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని తెలియజేస్తున్నాం.
భారత్ మాతాకీ జై…

బండి సంజయ్ కుమార్, ఎంపీ,
అధ్యక్షులు, బీజేపీ తెలంగాణ శాఖ.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!