మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి – సిపిఐ(ఎం.ఎల్) చండ్రపుల్లారెడ్డి పార్టీ
నిర్దేశం, హైదరాబాద్ :
మధ్య భారతదేశంలో జరుగుతున్న మానవ హనన నివారణకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు మావోయిస్టులతో బేషరతుగా శాంతి చర్చలకు పూనుకోవాలని సిపిఐ(ఎం.ఎల్) చండ్రపుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లెపల్లి ప్రబాకర్ శనివారం రోజు పంపిన పత్రిక ప్రకటనలో డిమాండ్ చేశారు. బుద్దిజీవులు, మేదావులు, హక్కుల నేతలు హైదరాబాద్ లో శాంతి చర్చలకోసం జరిపిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించినట్లుగా వెంటనే అటు కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టులు కాల్పుల విరమణ ప్రకటించి, శాంతి చర్చలు జరపాలని ఇచ్చిన పిలుపును మావోయిస్టు పార్టీ స్వాగతించింన క్రమంలో కేంద్రంలో బీజేపీ నరేంద్రమోదీ అమిత్ షా ప్రభుత్వంతో పాటు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్చలకు పూనుకోవాలని అన్నారు. ఆదివాసి ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలను, వారి జీవించే హక్కును పరిరక్షించేలా అక్కడి కేంద్ర మిలటరీ బలగాలను ఎత్తివేయాలని కోరారు.
2026, మార్చి లోపల మావోయిస్టు రహిత భారత్ గా చేసి చూపిస్తామనే పేరిట ప్రక్రుతి ఒడిలో సేదతీరే ఆదివాసి బిడ్డలను మాన ప్రాణాలతో చెలగాటమాడడం అమానుషం, అప్రజాస్వామికం అని అన్నారు. ఇప్పటికైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి, ఎలాంటి షరతులు విదించకుండా మావోయిస్టులతో చర్చలకు సిద్దపడాలని కోరారు. అర్థిక, రాజకీయ, సామాజిక, సాంఘీక సమస్య అయిన నక్సలైట్ల సమస్యను శాంతి భద్రతల సమస్యగానో లేదా తీవ్రవాద సమస్యగానో పాలకులు చూసినంతకాలం సమస్య పరిష్కారం కాదని పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్ కౌంటర్ల పేరుతో హత్యలు, సామూహిక అత్యాచారాలతో ప్రజా పోరాటాలను, విప్లవోద్యమాలను అడ్డుకోజాలరని కేంద్ర ప్రభుత్వానికి మల్లెపల్లి ప్రభాకర్ హితువు పలికారు.