ఎమ్మెల్సీ అభ్యర్థి కొణిదెల నాగబాబు పేరు ఖరారు చేసిన పవన్ కళ్యాణ్
విజయవాడ, నిర్దేశం:
శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. నిన్నటి వరకూ ఎమ్మెల్సీ అభ్యర్థి నాగబాబు పేరు ప్రచారం కాగా, బుధవారం ఉదయం ఆయన రాజ్యసభ స్థానం కోసం చూస్తున్నారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారం ఊపందుకున్న సమయంలో జనసేన పార్టీ వదంతులకు చెక్ పెట్టింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. నాగబాబు ప్రస్తుతం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నుంచి సమాచారం వచ్చింది. దాంతో నాగబాబు నామినేషన్ కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారని పి.హరిప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.