తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే మా లక్ష్యం
-రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మంథని, నిర్దేశం:
తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే మా లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హెచ్ఐసీసీలో “ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్ టీసీసీఐ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన “సమ్మిట్ ఆన్ ఫ్యూచర్ – రెడీ ఇండస్ట్రీ ట్రాన్స్ఫర్మేషన్: ఇన్నోవేటింగ్ ఫర్ గ్రోత్, ఎఫిషియన్సీ అండ్ సెక్యూరిటీ(గ్రోత్ ఎక్స్ 2025)”ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే మా లక్ష్యమని..
ఇది తేలికైన విషయం కాదు. కానీ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. పరిశ్రమలకు అనుకూలంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టి ఈ లక్ష్య సాధనలో భాగస్వామ్యం కావాలని పారిశ్రామికవేత్తలను కోరారు.
ఇతర రాష్ట్రాలకు ధీటుగా తెలంగాణ అన్ని రంగాల్లోనూ అభివృద్ధిలో దూసుకపోతుంది. సాఫ్ట్ వేర్ ఎగుమతుల్లో తెలంగాణ వృద్ధి రేటు 17.98 శాతం కాగా జాతీయ సగటు 8 శాతం మాత్రమే. ఐటీ రంగంలో తెలంగాణ సత్తా ఏంటో చెప్పడానికి ఈ ఒక్కటీ చాలూ అన్నారు.
టెక్నాలజీ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా కృత్రిమ మేథ(ఏఐ) అందుబాటులోకి రావడంతో అన్ని రంగాల్లోనూ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అలాగే.. అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మన ఆలోచన తీరు మారాలన్నారు.
ఈ ఏఐ యుగంలోనూ పాత ఆలోచనలతో.. సాంప్రదాయబద్ధంగా ముందుకెళ్తే మన మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా పరిశ్రమలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పారిశ్రామికవేత్తలూ కొత్తగా ఆలోచించాలన్నారు.
ఏఐ, క్వాంటమ్, మెషిన్ లెర్నింగ్ తదితర కొత్త టెక్నాలజీస్ సాయంతో సమాజం ఎదుర్కొంటున్న ఎన్నో సవాళ్లకు పరిష్కారాలను చూపించొచ్చు. ఆ దిశగా ఆవిష్కర్తలు కొత్తగా ఆలోచించాలని కోరుతున్నా. కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలకు మా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఉపాధి, జీఎస్డీపీలో ఎంఎస్ఎంఈల వాటానే అధికం. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎంఎస్ఎంఈలు, ఎస్ఎంఈలు మారాలి. లేదంటే రాబోయే రోజుల్లో వీటి మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని,
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏఐ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ కు హబ్ గా తెలంగాణను తీర్చిదిద్దుతాం. ఏఐ సమ్మిట్ ను విజయవంతంగా నిర్వహించాం.
ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తాం. ఎమర్జింగ్ టెక్నాలజీస్ సాయంతో పౌర సేవలను ప్రజల ముంగిటకు మరింత సమర్థవంతంగా చేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఈ సదస్సు నిర్వహణలో ఎఫ్ టీసీసీఐ, టీ – హబ్, టీ- వర్క్స్, టాస్క్, వీ హబ్, గూగుల్, మైక్రోస్థాప్ తదితర సంస్థలు భాగస్వామ్యమయ్యాయి.ఈ కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, వీఎస్ఈజడ్(మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ర్టీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా) డిప్యూటీ డెవలెప్ మెంట్ కమిషనర్ భవాని శ్రీ, ఎఫ్ టీసీసీఐ ప్రెసిడెంట్ డా.సురేష్ కుమార్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు.