ఫైబర్ నెటలో కొత్త సినిమాలు
జూన్ 2 నుంచి ఫస్ట్ డే ఫస్ట్ షో
విజయవాడ, జూన్ 1 : కొత్త సినిమా విడుదలైన రోజే ఇంట్లో కూర్చుని వీక్షించే సదుపాయాన్ని ఏపీ ఫైబర్ నెట్ కల్పిస్తోంది. థియేటర్లలో సినిమా విడుదలైన రోజే రూ.99కే ఇంట్లో కూర్చుని సినిమా ఏపీ ఫైబర్ నెట్ కొత్త సదుపాయాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. కొత్త సినిమాలు థియేటర్లలో విడుదలైన రోజే.. రాష్ట్రంలోని ప్రేక్షకులు తమ ఇంట్లో కూర్చుని చూడొచ్చని ఏపీ ఫైబర్‌నెట్ ప్రకటించింది.
ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్ ద్వారా కొత్త సినిమాలు ఆన్‌లైన్ విడుదల చేస్తామని ఫైబర్‌నెట్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి చెప్పారు. ”సినిమా తీసే నిర్మాతకు, చూసే ప్రేక్షకుడికి ఇద్దరికీ లాభం కలిగేలా కొత్త సినిమా అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.ఫస్ట్‌డే.. ఫస్ట్‌షో అనే పద్ధతిలో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. జూన్ 2న విశాఖపట్నంలో లాంఛనంగా ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌లో మొదటిసారి నిరీక్షణ సినిమా ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.రూ.99తో ఫైబర్‌నెట్ వినియోగదారుడు సబ్‌స్క్రైబ్ చేసుకుంటే కొత్త సినిమా చూడొచ్చని వివరించారు.
సబ్‌స్క్రైబ్ చేసుకున్నప్పటి నుంచి 24 గంటల వరకు ఆ సినిమా చూసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఓటీటీ తరహాలో కాకుండా నేరుగా లైవ్‌లో స్ట్రీమింగ్‌లా ఉంటుందని వివరించారు.గ్రామీణప్రాంతాల్లో ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ కనెక్టివిటీ ఎక్కువగా ఉండడంతో పట్టణాలకు వచ్చి థియేటర్లలో సినిమా చూడలేని వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని వివరించారు.ఏపీలో ఫైబర్‌నెట్ కనెక్షన్లను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు 55వేల కి.మీ ఓఎఫ్‌సీని తీసుకెళ్లాలన్న లక్ష్యం పెట్టుకున్నట్లు గౌతంరెడ్డి చెప్పారు.
ఇప్పటివరకు 37వేల కి.మీ. వరకు లైన్లు వేశామన్నారు.11,254 గ్రామ పంచాయతీల్లో 7600 పైచిలుకు గ్రామాలకు ఫైబర్‌నెట్ కనెక్టివిటీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రజలందరికీ తమ సేవలను చేరువ చేసేందుకు రెండు మూడు నెలల్లో కొత్త బాక్సులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటికే 5 కంపెనీలతో చర్చించామని, వచ్చే నాలుగేళ్లలో ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ను మరింత బలోపేతం చేయడానికి ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు.