ఎంపీ అరవింద్ మీడియా సమావేశం – అభివృద్ధి, రాజకీయాలపై ఘాటైన వ్యాఖ్యలు
నిజామాబాద్, నిర్దేశం :
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి, అభివృద్ధి పనులు, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, జిల్లా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి పనులపై హామీలు, ఆడవి మామిడిపల్లి రహదారి మరో నెల రోజుల్లో పూర్తవుతుందని తెలిపారు. అర్సాపల్లి, మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు ఏడాదిలోపు పూర్తవుతాయని హామీ ఇచ్చారు.
సుదర్శన్ రెడ్డిపై విమర్శలు
మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా, “ముసలాయన” అంటూ పరోక్షంగా విమర్శించారు.”ఒక్క బ్రిడ్జీ కూడా నిర్మించని సుదర్శన్ రెడ్డి ఇక అభివృద్ధి గురించి ఎలా మాట్లాడతాడు?” అని ప్రశ్నించారు.”ఎంపీగా నేను పది ఫ్లైఓవర్లు నిర్మిస్తాను” అని ప్రకటించారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీ – నవోదయ భూముల వివాదం
నిజాం షుగర్ ఫ్యాక్టరీ (NSF) భూములను నవోదయ విద్యాలయానికి కేటాయించాలనే నిర్ణయాన్ని తప్పుబడుతూ, “ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ఆటంకం కలిగించే ఈ చర్య సరైనదా?” అని ప్రశ్నించారు.”సారా వ్యాపారం కోసం NSF భూములను స్వాధీనం చేసుకునే కుట్ర జరుగుతోంది” అని ఆరోపించారు.”ముస్లింలు ఓట్లు వేయలేదన్న కోపంతో సుదర్శన్ రెడ్డి వారిని బెదిరిస్తున్నాడు” అని ఆరోపించారు.”హిందూ-ముస్లిం పేర్లు పెట్టి తిట్టడం తగదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.”జవహర్ నవోదయ కాదు, జవహర్ నమాజ్ చేయాలనుకుంటున్నారా?” అంటూ బోధన్ ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించారు.
రాజకీయ వ్యూహాలు – బీజేపీ విజయంపై ధీమా
“ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కార్యకర్తల త్యాగం, మోదీ విజయవంతమైన పాలన కారణంగా సాధ్యమైంది” అని తెలిపారు.”బీసీ జనగణన సరిగ్గా నిర్వహించలేదని, కోటి జనాభా గణనలో పొరపాటు జరిగిందని” విమర్శించారు.”స్థానిక సంస్థల (Local Body) ఎన్నికలను ఆలస్యం చేయాలనే ఆలోచనలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది” అని ఆరోపించారు.”నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం (MIM), బీజేపీ మాత్రమే గెలుస్తాయి” అని ధీమా వ్యక్తం చేశారు.
ప్రభుత్వ తీరుపై విమర్శలు
“ప్రొటోకాల్ ప్రకారం సీఎం రాష్ట్రంలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం మీటింగ్ పెట్టడమేంటి?” అని ప్రశ్నించారు.”మహిళా దినోత్సవం రోజున అఖిలపక్ష సమావేశం పెట్టడం ఎంతవరకు సమంజసం?” అని విమర్శించారు.
విమానాశ్రయం & రైల్వే అభివృద్ధిపై హామీ
“నిజామాబాద్ ఎయిర్‌పోర్ట్ కోసం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు” అని ఆందోళన వ్యక్తం చేశారు.”రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల పురోగతిని స్వయంగా పరిశీలిస్తాను” అని తెలిపారు.”డి-లిమిటేషన్ వల్ల ఉత్తర భారతదేశంలో సీట్లు పెరిగితే తప్పేంటి?” అని ప్రశ్నించారు.ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అభివృద్ధి హామీలతో పాటు, ప్రభుత్వంపై చేసిన విమర్శలు బలమైన చర్చకు దారితీశాయి.