ఆధునిక సభ్య సమాజంలో మహిళాభ్యున్నతి ఒప్పుకోదగిన పరిణామమే

AP 39 TV 25ఫిబ్రవరి 2021:

నాటికి, నేటికి స్త్రీల పరిస్థితులు మారాయి. నాలుగు గోడల మధ్య వంటిల్లే స్వర్గంలా భావించే మహిళలు  ఇప్పుడు జనజీవన స్రవంతిలో ఒక విశిష్టమైన శక్తిలా అంచెలంచెలుగా ఎదుగుతున్నారు, ఆనందించవలసిన విషయం. విద్యారంగంలో బాలికలదే అగ్రస్తానం అభినందించవలసిన విషయం,వృత్తి విద్యాకోర్సులు, ఉద్యోగాలలో, రాజకీయాలలో, స్త్రీలకూ ప్రాముఖ్యత !!స్త్రీలు సమంగా, నేర్పుగా, అంకిత భావంతో పనిచేస్తున్నారు.వారు రాణించినంత  విధంగా పురుషులు రాణించడం లేదనేది సత్యం. వైద్య, విద్యా, విజ్ఞాన ,రాజకీయ, క్రీడా, రక్షణ, రంగాలలో ఎక్కడ చూసినా ఏ నోట విన్నా,
మహిళా శక్తి!
మహిళా స్పూర్తి!!
మహిళ చైతన్యం !!!
మహిళా అభ్యున్నతి. !!!!
దీని గురించి ఉపన్యాసాలూ ఉపమానాలు, సన్మానాలు,సత్కారాలను
విని, చూసి, పొంగిపోవటంలో ఆవగింజంతైనా అతిశయోక్తి లేదు. మనస్పూర్తిగా అందరు ఏకగ్రీవంగా అంగీకరించవలసిన విషయమే.కానీ…
ఈ రెండు అక్షరాలలోనే వుంది అసలు విషయమంతా ఇన్నిరకాలుగా అన్నివిధాలుగా ఇంతగొప్పగా ఎంతో అద్భుతంగా ఆవిష్కరించబడుతున్న స్త్రీపాత్ర,సమాజంలో మమేకమవుతున్న స్త్రీ అభ్యుదయం ఇంకా మొదట్లోనే వుంది! మొక్కగానే వుంది!! ఎక్కడో ఒక చోట దాని వేరు కత్తిరించబడుతునే వుంది!!! కుమార్తెగా, బాలికగా, విద్యార్ధినిగా, సోదరిగా, గృహిణిగా, ఉద్యోగినిగా, మంత్రిగా ఇలా ఎన్నో విధాలుగా రూపాంతరాలు చెంది సమాజంలో క్రియాభాగంగా మారినా స్త్రీ యొక్క స్వయం నిర్ణయం ఇంకా పురుషుల చేతుల్లోనే వున్నది. స్త్రీ పురుషులు ఇద్దరూ పరస్పర అవగాహనతో కలసి నడవాల్సిందే! నియంతృత్వధోరణితో నడవడమే అభ్యంతరకరం ఐతే అదే జరుగుతోoది. అడుగడుగునా ఆటంకాలు. అలుపెరుగని పోరాటాలు !! అత్మాభిమాన అణచివేతలు..ఆత్మవిశ్వాసానికి మెట్లు! ఇవన్ని కలసి మహిళలను వుప్పెనలా చుట్టుకుంటున్నాయి. తరతరాలనుండి వస్తున్న సంప్రదాయ దురాచారాలు నరనరాల్లో జీరించుకుపోయిన ఈ వ్యవస్థలో కాలక్రమేణా పెను మార్పులు చోటు చేసుకున్నాయి, ఇంకా పూర్తిస్థాయిలో మార్పులు జరగాలంటే చాలా సమయం పట్టొచ్చు. ఇప్పటికే పురుషుల ఆలోచనా దృక్పథంలో మార్పు వచ్చింది, ఎలా అంటే? ఇప్పుడు భార్య అంటే గృహిణిగా సేవలందించడమే కాకుండా ఉద్యోగినిగా ఆర్ధిక సేవలందించి, మాతృత్వంతో సంసారాన్ని పెంచే ‘త్రి’పాత్రధారిణి!!!.
అప్పుడూ ఇప్పుడూ ఒకే విధంగా స్త్రీ శ్రమిస్తూనే వుంది.గృహ హింస, విడాకుల చట్టం ఇలా ఇంకా ఎన్నో చట్టాలు, స్త్రీలకి రక్షణ కవచాలుగా వచ్చినా సగటు స్త్రీ జీవితంలో రక్షణ కరవైందన్న కఠినమైన వాస్తవాన్ని అందరు గుర్తుంచుకోవాల్సిన అవసరం వుంది.మహిళే స్వయంగా రాజకీయ చక్రం తిప్పుతున్న నేపథ్యంలో మహిళా బిల్లు ప్రవేశ పెట్టటానికే ఎన్నెన్ని అవస్థలు పడ్డారో? ఎన్నెన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయో? అందరికీ తెలిసిన విషయమే. ఏది ఏమైనా సగటు స్త్రీ జీవితం  లో సమూలమైన మార్పు రావాలి . అత్యాచార కేసుల్లో దోషిని కఠినంగా శిక్షించాలి,ప్రతి మహిళ ఆత్మ విశ్వాసంతో బ్రతుక గలగాలి, నిర్భయంగా నిర్ణయాధికారాల స్థానాలు చేపట్టగలగాలి. అది జరగాలంటే. ముఖ్యంగా పురుషుల దృక్పథం మారాలి. మహిళాచైతన్యం రావాలి. చైతన్యం ఎక్కడినుండో రాదు. ముందు మనఇంటి నుండే మొదలుపెట్టాలి. స్త్రీ తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ స్వాభిమానంతో, ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయాలి. అటువంటి సమసమాజం గల అద్భుత ప్రపంచాన్ని ఆవిష్కరించవలసిన సమయానికి స్వాగతం పలుకుదాం.నేటి మహిళకు అభినందనలు తెలుపుదాం.

 

 

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!