ప్రధాని పర్యటనపై కోటి ఆశలు

ప్రధాని పర్యటనపై కోటి ఆశలు

విజయవాడ, నిర్దేశం:
అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి సంబంధించి కీలక ఘట్టం ప్రారంభం కానుంది. మే 2న ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అయితే అమరావతి రాజధానికి సంబంధించి ప్రధాని మోదీ వరాలు ప్రకటిస్తారని భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి సరైన సాయం అందుతూ వస్తోంది. బడ్జెట్లో నిధుల కేటాయింపు తో పాటు కీలక ప్రాజెక్టులను సైతం కేంద్రం మంజూరు చేసింది. అయితే ఇప్పుడు నేరుగా మోదీ అమరావతిలో అడుగుపెడుతుండడంతో.. భారీ వరాలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నుంచి ప్రధానికి వినత్తులు అందినట్లు సమాచారం. ప్రధాని అమరావతి వేదికగా కీలక ప్రకటన చేస్తారని అంచనాలు కూడా ఉన్నాయి. అయితే గత అనుభవాల దృష్ట్యా.. అమరావతికి నిధులు ఇస్తారా? లేకుంటే వేరే రూపంలో సాయం ప్రకటిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. 2017లో అమరావతి రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ప్రధాని నరేంద్ర మోడీ ఆ సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం హాజరయ్యారు. అప్పట్లో అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ భారీ వరాలు ప్రకటిస్తారని అంతా భావించారు. నిధులు ప్రకటిస్తారని కూడా అంచనా వేశారు. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. పవిత్ర నదుల నుంచి తెచ్చిన నీరు, మట్టితో సరిపెట్టారు. అటు తరువాత విపక్షాల నుంచి సటైర్స్ వినిపించాయి. విపక్ష నేతలు ప్రధాని తీరును తప్పుపట్టారు. 2018లో ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటకు వచ్చిన సమయంలో సైతం దీనిపై మాట్లాడారు. మరోసారి అటువంటి పరిస్థితి ఉండదని.. అమరావతి రాజధాని పునర్నిర్మాణ సమయంలో కేంద్రం ప్రత్యేక నిధులు ప్రకటిస్తుందని ఎక్కువమంది ఆశాభావంతో ఉన్నారు.మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణ శంకుస్థాపనకు సమయం ఆసన్నమవుతోంది.

ప్రధాని పర్యటన కోసం ఏపీ ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. స్వాగత ఏర్పాట్ల నుంచి బహిరంగ సభ కోసం ప్రత్యేకంగా నిర్ణయాలు తీసుకుంటుంది. లక్షలాదిమందితో సభ ఏర్పాటుకు కసరత్తు కొనసాగుతోంది. ఇదే సమయంలో ప్రధాని అమరావతి కేంద్రంగా చేసే ప్రసంగం పై ఆసక్తి నెలకొంది. తప్పకుండా వరాలు ప్రకటిస్తారన్న నమ్మకం ఏపీ ప్రజల్లో ఉంది.అయితే అమరావతికి ప్రధాని నరేంద్ర మోడీ రావడం ఇది రెండోసారి. అయితే రెండోసారి శంకుస్థాపనకు ప్రధాని రావడం ఏపీ బీజేపీ( నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సీఎం చంద్రబాబు ప్రత్యేక విన్నపం మేరకు మోడీ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అయితే ప్రధాని వస్తున్నందున పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం చేసేలా కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. ఏపీకి అమరావతి రాజధానిగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా మారడంతో.. ఇతోధి కంగా సాయం చేయాలని ప్రధాని మోడీకి ఎప్పటికీ చంద్రబాబు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ప్రధాని మోదీ సైతం అమరావతి కోసం భారీ వరం ప్రకటించే అవకాశం ఉందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో సాగుతోంది. అయితే మోడీ గతం మాదిరిగా చేతులెత్తేస్తారా? లేకుంటే సాయం ప్రకటిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »