వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ‘లైట్లు ఆఫ్’ నిరసన కార్యక్రమం.
…ఏప్రిల్ 30 రాత్రి 9.00 నుండి 9.15 వరకు స్వచ్ఛందంగా లైట్ లు ఆపేయాలని పిలుపు
నిజామాబాద్, నిర్దేశం:
వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వం పెత్తనం చేసే ఆలోచన తో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ చట్టం–2025కు దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించాలనే డిమాండ్‌తో నిజామాబాద్ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో ఏప్రిల్ 30న మంగళవారం రాత్రి 9:00 నుంచి 9:15 వరకు ‘లైట్లు ఆఫ్’ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు.
15 నిమిషాల మౌన నిరసనతో కేంద్రానికి హెచ్చరిక
జేఏసీ నాయకులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, “ప్రతి పౌరుడు తన ఇంటి లోపల, వాణిజ్య సంస్థల్లో దీపాలు ఆపి 15 నిమిషాలు మౌనంగా ఉండాలని కోరుతున్నాం. ఇది ఓ శాంతియుత ఉద్యమం. కేంద్రానికి ప్రజలంతా సంఘటితంగా నిరసన చూపించే సమయంలో ఇది ఒక కీలక దశ” అని పేర్కొన్నారు.
విలేకరుల సమావేశంలో జేఏసీ సభ్యులు అబ్దుల్ అజీమ్, మౌలాన్ కమలుద్దీన్ కమల్, నీరడి లక్ష్మణ్, షేక్ హుస్సేన్, తదితరులు మాట్లాడుతూ –
“ఈ బిల్లు వలన ముస్లింల యొక్క ఆస్తులపై ముస్లిం హక్కు పోతుంది. ఇది మదర్సాలు, మసీదులు, ఖబర్‌స్తాన్ల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుతుంది. మత స్వాతంత్ర్యాన్ని హరించే ఈ బిల్లును మేము ఒప్పుకోమూ.”
ఊరూరా చైతన్యం, సోషల్ మీడియా ప్రచారం
ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జేఏసీ సోషల్ మీడియా ప్రచారంతో పాటు ప్రకటనలు, ఫ్లెక్సీలు, పోస్టర్ల ద్వారా అవగాహన కల్పిస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, ముఖ్యంగా నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భైంసా , బోధన్, కామారెడ్డి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొననున్నారు.
JAC సమన్వయ కమిటీ అభ్యర్థన
జేఏసీ ప్రజలు, మతపెద్దలు, మౌలానాలు, రాజకీయ, సామాజిక సంస్థలు, యువత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
“వక్ఫ్ బోర్డు ప్రభుత్వ అధీనంలోకి పోకుండా ఉండాలంటే, ఈ నిరసన శబ్దంలేని గళంగా మారాలి” అని వారు వ్యాఖ్యానించారు.