కేటీఆర్ మైండ్ గేమ్
హైదరాబాద్, నిర్దేశం:
కంచ గచ్చిబౌలి భూముల అమ్మకం ముసుగులో వేల కోట్ల రూపాయల భారీ కుంభకోణం దాగుందంటూ సంచలన కామెంట్స్ చేశారు. అవి 400 ఎకరాలు కాదు.. వేల ఎకరాల వ్యవహారం ఉందన్నారు. ఆ కుంభకోణంలో ఓ బీజేపీ ఎంపీ హస్తం కూడా ఉందనేది కేటీఆర్ ఆరోపణ. 48 గంటల్లో ఆ యవ్వారమంతా బయటపెడతానంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణలో కాక రేపుతున్నాయి. కేటీఆర్ ఏం బయటపెడతారనేది కాసేపు పక్కన పెడితే.. ఇక్కడో చిన్న లాజిక్ పాయింట్ మాట్లాడుకోవాల్సిన అవసరమైతే ఉంది. కంచ గచ్చిబౌలి భూములను ఇంకా అమ్మకానికే పెట్టలేదు. ఆ 400 ఎకరాలను ఇంకా ఎవరికీ కేటాయించలేదు. వేలం కూడా వేయలేదు. అసలు అమ్మకాలే జరగనప్పుడు.. ఇంకా ఎవరికీ భూములే కేటాయించనప్పుడు.. కంపెనీలే రానప్పుడు.. వేల కోట్ల కుంభకోణం ఎలా జరుగుతుంది? ఇంత చిన్న లాజిక్‌ను కేటీఆర్ ఎలా మిస్ అవుతున్నారు?ప్రస్తుతానికి ఆ 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూములను TGIIC కి మాత్రమే కేటాయించింది తెలంగాణ సర్కారు. ఆ ల్యాండ్స్ అభివృద్ధి చేసి.. ఐటీ కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలకు కేటాయించాలనేది ప్రభుత్వ ఆలోచన. ఆ ప్రక్రియలో తొలి అడుగు మాత్రమే పడింది. భూములు టీజీఐఐసీ చేతికి వచ్చాయి అంతే. ఇంకా లేఅవుట్లు కూడా చేయలేదు. టెండర్లు గట్రా పిలవలేదు.
కేవలం అక్కడ పెరిగిన చెట్లను తొలగించే పని మాత్రమే మొదలుపెట్టారు. అంతలోనే అవి వర్శిటీ భూములంటూ, నెమళ్లు, జింకలు, పర్యావరణం అంటూ నానా రచ్చ జరిగింది. ఏఐ జనరేటెడ్ వీడియోలు, ఫోటోలతో ఫేక్ ప్రచారంతో అసలు నిజం ఏంటో తెలిసేలోగా.. అబద్ద ప్రచారం దేశాన్ని చుట్టేసింది. సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. తెలంగాణ ప్రభుత్వం ఆ ఏఐ వీడియోలు, ఫోటోలపై ఉక్కుపాదం మోపుతుండటంతో ఆ ఫేక్ పోస్టులను డిలీట్ చేస్తున్నారంతా. ఆ కోవలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా ఉండటం ఆసక్తికరం.బీఆర్ఎస్ సోషల్ మీడియాను బోనులో నిలబెట్టే ప్రయత్నం కూడా జరుగుతోంది. గులాబీ సోషల్ వింగ్ హెడ్స్ కొణతం దిలీప్, క్రిషాంక్‌లను పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఫేక్ ప్రచారం వెనుక ఉన్న కేటుగాళ్లు త్వరలోనే బయటకు వస్తారు. ఇలా వ్యవహారం బీఆర్ఎస్, బీజేపీ బడా నేతల మెడకు చుట్టుకుంటుండటంతో.. కావాలనే డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా కేటీఆర్ అలా మైండ్ గేమ్ ఆడుతున్నారా? అనే అనుమానమూ వ్యక్తం చేస్తున్నారు.ఇక్కడే కేటీఆర్ చాలా జాగ్రత్తగా స్కెచ్ వేశారని అంటున్నారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం వెనుక ఓ బీజేపీ ఎంపీ హ్యాండ్ కూడా ఉందని అనడం వ్యూహాత్మకమే కావొచ్చు. కాంగ్రెస్, బీజేపీలు ఉప్పు-నిప్పు. కేంద్రంలో అయినా, రాష్ట్రంలో అయినా ఆ రెండు పార్టీలకు అస్సలు పడదు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి తరుచూ విమర్శలతో కుళ్లబొడుస్తుంటారు. అటువైపు నుంచీ మాటల దాడి తీవ్రంగానే ఉంది. కానీ, కేటీఆర్ మాత్రం ఆ రెండు పార్టీలు తెరవెనుక కలిసి పని చేస్తున్నాయని పదే పదే అంటున్నారు. అబద్దాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారని అంటున్నారు. అందులో భాగంగానే.. కంచ గచ్చిబౌలి భూముల తతంగం వెనుక బీజేపీ ఎంపీ కూడా ఉన్నారంటూ అక్రమ సంబంధం అంటగట్టేస్తున్నారని అనుమానిస్తున్నారు. విద్యార్థులను రెచ్చగొట్టిందే బీజేపీ అని విమర్శలు ఉన్నాయి. ఆ పార్టీ స్టూడెంట్స్ వింగ్ ఏబీవీపీ ఆధ్వర్యంలోనే విద్యార్థులు రోజుల తరబడి ఆందోళనలు చేశారు. మరి, కేటీఆర్ మాత్రం ఆ భూముల వెనుక స్కాం ఉందని.. అందులో బీజేపీ ఎంపీ రోల్ కూడా ఉందని ఆరోపిస్తున్నారు. ఇదంతా జనాలను కన్ఫ్యూజ్ చేసి.. ఆ కన్ఫ్యూజన్‌లో తాము కొంతకాలం పాటు రాజకీయ చలిమంట కాచుకోవాలనే మైండ్ గేమ్ మినహా మరొకటి కాకపోవచ్చని విశ్లేషిస్తున్నారు.