నిర్దేశం, హైదరాబాద్ః అధికారం దక్కితే ఎంతటి ప్రజాస్వామ్యవాదైనా నియంత అవుతాడు, అధికారం పోతే ఎంతటి నియంతైనా ప్రజాస్వామ్యవాది అవుతాడు అనేది రాజకీయ సామెత. ఇది నూటికి నూటయాబైపాళ్లు నిజమే. కుర్చీలో ఉన్నప్పుడు ఓరకంటనైనా చూడని నేతలు.. కుర్చీదిగాక ప్రజల్లో మెదిలేందుకు కుస్తీ పడుతుంటారు. ఈ విషయంలో మన తెలుగు రాజకీయాలను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే, అధికారం కోసం వాల్లు చెప్పులు అరిగే వరకు ప్రజల్లో తిరుగుతారు. దీనినే రాజకీయ పరిభాషలో పాద(వి)యాత్ర అంటారు. ఎందుకంటే ఈ యాత్రలు కేవలం పదవి కోసమే జరుగుతాయి, ప్రజల కోసం కాదు.
తెలుగునాట పాదయాత్ర అనేది సక్సెస్ ఫుల్ పొలిటికల్ ఫార్ములా. వైయస్ రాజశేఖర్ రెడ్డి నుంచి భట్టి విక్రమార్క వరకు.. పాదయాత్రతో అధికారం పొందినవారే. అందుకే కాబోలు.. షెడ్డులో పడ్డ కారును రోడ్డు ఎక్కించేందుకు కేటీఆర్ పాదయాత్రకు పూనుకున్నారు. గురువారం ట్విట్టర్ (ఎక్స్)లో నిర్వహించిన ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో ఓ నెటిజెన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తొందరలోనే పాదయాత్ర చేయబోతున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. నిజానికి, కేసీఆర్ పాదయాత్ర చేస్తారని నిన్నటి వరకు ప్రచారం జరిగింది. అయితే కారు ఓనరు యువరాజావారేనని టాక్ నడుస్తున్న నేపథ్యంలో.. పాదయాత్రకు కూడా ఆయనే దిగి అనుమానాల్ని నిజం చేస్తూ ఓ క్లారిటీ ఇచ్చేశారు.
ఎందుకంత తొందర?
ఇది సరే కానీ, ఉండలేనమ్మ ఉరికురికి పడిందన్నట్టు.. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాకముందే గులాబీ పార్టీకి వచ్చిన తొందరపాటేంటి? ఆ మాటకొస్తే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినట్టు ఎందుకంత హడావుడి? పదేళ్ల ప్రభుత్వంలో చేసింది ముష్టి పదోవంతు కూడా కాదు. పైగా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతను ప్రజలు ఇంకా మర్చిపోనేలేదు. అంతలోనే ఎగిరెగిరి పడాలని చూస్తే.. ఉన్న పళ్లు ఊడే ప్రమాదమే ఎక్కువుంది. అయిననూ.. కిందా మీదా పడి యాత్ర చేసినా వచ్చే ఎన్నికల టైం వరకు ప్రజలకు ఇది గుర్తుండేదీ కష్టమే.
కాంగ్రెస్ తక్కువేమీ తినలేదు
కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకత మీద. మరి, తమ అధికారం వ్యతిరేకత మీద పేర్చిన పేకమేడని గుర్తెరగకుండా గులాబీ పార్టీకి ఏమాత్రం తీసిపోని రీతిలో హస్తం నేతలు ఉన్నారు. ఎన్నికల్లో మాట్లాడిన పెద్ద డైలాగులు ఇప్పుడు మచ్చుకైనా వినిపించడం లేదు. హామీలు ఏమయ్యాయంటే.. చీరుతా, చింపుతా అంటూ రౌడీ భాషలోనే మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బదులు.. సోషల్ మీడియా ట్రోల్స్ ను ఎలా ఆపాలనే యావనే ఎక్కువైంది కాంగ్రెస్ నేతలకు. బహుశా.. ఇంతటి దిక్కుమాలిన ప్రభుత్వం ఈ దేశ చరిత్రలో ఉండదు కాబోలు. కాంగ్రెస్ నేతలు తమ హుందాతనాన్ని తెలుసుకోవడంతో పాటు, తమ బాధ్యతను ఎరిగి ప్రవర్తించకపోతే.. కేటీఆర్ పాదయాత్రను సక్సెస్ చేసినవారౌతారు.
చిన్నా చితకా పార్టీలు కూడా పాదయాత్రలు చేశాయి. వాటికి ఆశించిన ఫలితాలేమీ రాలేదు. అయితే, పెద్ద పార్టీలకు మాత్రం పాదయాత్ర అనేది బంగారు బాతనే చెప్పాలి. పాదయాత్ర చేసి కూడా ప్రతిపక్షంలోనే ఉన్న ఏకైక నాయకుడిగా రాహుల్ గాంధీ రికార్డ్ సృష్టించారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ చేసిన పాదయాత్రతో కాంగ్రెస్ పొందిన లాభం ఏమీ లేదనుకోండి, అది వేరే విషయం. ఇక నిన్నీమధ్య లోకేష్, భట్టి విక్రమార్కలకు కూడా పాదయాత్ర బాగా కలిసి వచ్చింది. మరి కేటీఆర్ కు ఎంత మైలేజ్ ఇస్తుందో చూడాలి.
దేశ చరిత్రలో 5 ప్రముఖ పాదయాత్రలు
*సోషలిస్ట్ నేత చంద్రశేఖర్ 1983లో భారత్ యాత్ర పేరుతో 4,200 కి.మీ పాదయాత్ర చేశారు. ఇది దేశంలో జరిగిన మొదటి రాజకీయ పాదయాత్ర. అంతే కాకుండా ఇదే పెద్ద పాదయాత్ర.
*2003లో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజకశేఖర్ రెడ్డి 1,500 పాదయాత్ర చేశారు. తెలుగు నేల మీద జరిగిన మొదటి రాజకీయ పాదయాత్ర ఇదే.
*2013లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, 2,800 కి.మీ పాదయాత్ర చేశారు.
*2018లో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి 3,648 కి.మీ పాదయాత్ర చేశారు. తెలుగు నేల మీద చేసిన పెద్ద పాదయాత్ర.
*2022-23 లో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో 4,260 కి.మీల పాదయాత్ర చేశారు. ఈమధ్య కాలంలో ఎక్కువ చర్చనీయాంశమైన యాత్ర ఇది.
వీటితో పాటు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 2023లో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క 1,350 కి.మీ పాదయాత్ర చేశారు. తెలంగాణలో ఇదే పెద్ద పాదయాత్ర.
ఈ యాత్రలన్నీ సరిగ్గా ఎన్నికలకు ముందు చేసినవే. ఈ యాత్రల అనంతరం జరిగిన ఎన్నికల్లో సంబంధిత పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అయితే దేశంలో పేరుగాంచిన యాత్రల్లో సగం తెలుగు రాష్ట్రాల్లోనే జరగడం విశేషం.