కేసీఆర్ మౌనమేల ?
– పార్టీ నుంచి పెరుగుతున్న వలసలు
– ముంచుకొస్తున్న ఎంపీ ఎన్నికల సమయం
– క్యాడర్ లో స్తబ్ధత
బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు పెరుగుతున్నప్పటికీ అధినేత కేసీఆర్ మౌనం వీడకపోవడం క్యాడర్ ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో స్తబ్ధత ఏర్పడింది. ఓటమి నుంచి తేరుకోకముందే కేసీఆర్ తుంటి ఎముక విరిగి ఇంటికే పరిమితమయ్యారు. ఇటీవల నల్లగొండ సభకు హాజరైనప్పటికీ ఆ తర్వాత మళ్లీ బయటకు రావడం లేదు.
పార్లమెంట్ ఎన్నికల సమయం ముంచుకొస్తోంది. ఎన్నికలకు సన్నద్ధం కావలసిన సమయంలో కేసీఆర్ మౌనంగా ఉంటున్నారు. అంతేగాక వలసలను ఆపలేకపోతున్నారు. ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు పార్టీనుంచి వెళ్లిపోగా, మరికొందరు ఎంపీలు, ముఖ్యనాయకులు వెళ్లిపోడానికి సిద్ధంగా ఉన్నారనే సమాచారం ఉన్నప్పటికీ ఎవరినీ సముదాయించడం లేదు. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలు కేటీఆర్, హరీష్ రావు మాత్రమే చూస్తున్నారు.
మేడిగడ్డకు వెళ్లని కేసీఆర్
ఇటీవల నల్లగొండలో జరిగిన సభలో మేడిగడ్డకు వెళ్లి ఏమి పీకుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ ప్రశ్నించారు. తామూ వెళ్తామన్నారు. బీఆర్ఎస్ బృందం వెళ్లింది కానీ కేసీఆర్ వెళ్లలేదు. అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరుకాలేదు. అసలు కేసీఆర్ వ్యూహం ఏమిటనేది ఆపార్టీ నాయకులకు కూడా అర్థం కావడం లేదు. ఉద్యమ సమయంలోనూ కేసీఆర్ కొన్ని రోజులు క్రీయాశీలంగా, మరికొన్ని రోజులు మౌనంగా ఉండేవారు. అయితే ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల ముంగిట మౌనం సరైందికాదని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
క్యాడర్ లో ఉత్సాహం నింపడంలో నిర్లక్ష్యం
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహం కాంగ్రెస్ శ్రేణుల్లో కనబడుతోంది. బీజేపీకి దేశవ్యాప్తంగా అనుకూలంగా ఉందని, మళ్లీ అధికారంలోకి వస్తామనే ఆత్మవిశ్వాసం ఆపార్టీ క్యాడర్ లో కనిపిస్తోంది. బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం డీలా పడిపోయాయి. పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి చర్యలు చేపట్టడం లేదు. పార్టీలో సంస్థాగతంగా మార్పులు చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా అధ్యక్షులుగా కష్టపడేవారిని గాకుండా, కేటీఆర్ అనుచరులను నియమించారు. జిల్లా అధ్యక్షులు చాలామంది అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. పార్టీలో సంస్థాగతంగా మార్పులు చేయాలని, కొత్త వారికి పదవులివ్వాలని అంటున్నారు. ఎక్కువ మందికి కార్యవర్గంలో చోటు కల్పించాలంటున్నారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత కంటే కేసీఆర్ రంగంలోకి దిగితేనే బాగుంటుందంటున్నారు.