ఏపీకి బస్సులు తిప్పే విషయంలో కీలక సూచనలు చేసిన కేసీఆర్!

  • ఈ వారంలోనే ఉన్నతాధికారుల చర్చలు
  • నష్టం రాకుండా ఒప్పందాలు చేసుకోండి ఆర్టీసీ అధికారులతో కేసీఆర్

అన్ లాక్ సీజన్ లో భాగంగా, ఏ రాష్ట్రాల మధ్య కూడా ప్రయాణికులకు ఆటంకాలు కల్పించవద్దని, ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించేందుకు వీలు కల్పించాలని కేంద్రం ఆదేశించిన వేళ, బస్సులను తిరిగి పునరుద్దరించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ అధికారుల మధ్య హైదరాబాద్ లో చర్చలు జరుగనున్నాయని తెలుస్తోంది.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న దృష్ట్యా, ఇంతవరకూ రాష్ట్ర పరిధిలో హైదరాబాద్ మినహా, మిగతా ప్రాంతాల్లో మాత్రమే బస్సులను నడిపించాలని గతంలో ఆదేశాలు ఇచ్చిన కేసీఆర్, నిన్న అధికారులతో జరిగిన సమీక్షలో, అంతర్రాష్ట్ర సర్వీసులను ప్రారంభించే అంశం ప్రస్తావనకు రాగా, కొన్ని కీలక సూచనలు చేశారని సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఉండరాదని, ఆదాయం కోల్పోవాల్సిన పరిస్థితిని తెచ్చుకోకుండా, రెండు ఆర్టీసీలూ సమానంగా బస్సులను నడిపేలా చూసుకుంటూ, ఒకే పరిమాణంలో కిలోమీటర్ల లెక్కలు కూడా ఉండేలా డీల్ కుదుర్చుకోవాలని సూచించారు.

ఏపీతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలతోనూ ఇదే విధమైన ఒప్పందాలు కుదుర్చుకోవాలని ఆదేశించిన ఆయన, ఉమ్మడి ఏపీలో సైతం ఇదే విధమైన ఒప్పందాలు ఉన్నాయని, రాష్ట్రం విడిపోయిన తరువాత అవి ఏపీకి మాత్రమే పరిమితమయ్యాయని గుర్తు చేశారు. వాస్తవానికి లాక్ డౌన్ ముందు లెక్కలను పరిశీలిస్తే, తెలంగాణలోకి 1000కిపైగా ఏపీ బస్సులు వస్తుండగా, తెలంగాణ నుంచి ఏపీకి 750 బస్సులే వెళుతుండేవి. టీఎస్ లోని 2.50 లక్షల కిలోమీటర్ల పరిధిలో ఏపీ బస్సులు తిరుగుతూ ఉండగా, ఏపీలో టీఎస్ బస్సులు 1.50 లక్షల కిలోమీటర్లే తిరుగుతున్నాయి.

ఈ విషయాన్నే ప్రస్తావించిన కేసీఆర్, ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఇదే సరైన సమయమని అన్నారు. ఆదాయ నష్టం లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. బస్సులను తిప్పేందుకు ఏపీ సిద్ధంగానే ఉందని, మనం గ్రీన్ సిగ్నల్ ఇస్తే, బస్సులను వెంటనే ప్రారంభించవచ్చని అధికారులు వెల్లడించగా, పరిస్థితులను విశ్లేషించి, ఉన్నతాధికారులే తుది నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ఆదివారంలోగా హైదరాబాద్ లో సమావేశం అవుతారని తెలుస్తోంది.
Tags: APSRTC, TSRTC, KCR, Andhra Pradesh, Telangana

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!