కేసీఆర్ కు అనర్హత వేటు భయం, అసెంబ్లీ సమావేశాలకు హాజరు
హైదరాబాద్ , నిర్దేశం:
తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలు అసెంబ్లీకి హాజరు కావడం లేదు. వారు రాకపోతే నిబంధనల ప్రకారం అనర్హతా వేటు వేస్తామని అధికార పార్టీలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ప్రసంగం రోజున ఒక్క రోజు వెళ్లారు. దాంతో హాజరు కావడం లేదన్న కారణంతో అనర్హతా వేటు పడకుండా జాగ్రత్తలు పడ్డారు. అయితే ఆ హాజరు చెల్లదంటున్నారు కానీ.. అది వేరే విషయం. ఒక్క రోజు జగన్ తన శపథాన్ని పక్కన పెట్టి అసెంబ్లీకి వెళ్లి వచ్చారు. ఇప్పుడు తెలంగాణ ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా ఒక్క రోజు అసెంబ్లీకి వెళ్లాలని అనుకుంటున్నారు. త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశ పెట్టే రోజున ఆయన బడ్జెట్ ప్రసంగం వినేందుకు అసెంబ్లీకి హాజరవుతారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో ఆయన గజ్వేల్ నుంచి గెలిచినప్పటికీ.. పార్టీ ఓడిపోవడంతో అసెంబ్లీకి రావడం లేదు. ప్రతిపక్ష నేతగా కూడా ఆయనే ఎన్నికయ్యారు. అయినా కిందపడిన కారణంగా మొదట్లో అసెంబ్లీకి రాలేదు. తర్వాత బడ్జెట్ పెడుతున్న రోజున ఒక్క రోజు అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ ప్రసంగం విని వెళ్లి పోయారు. మళ్లీ ఇప్పటి వరకూ అసెంబ్లీ వైపు రాలేదు. మరోసారి ఆయన బడ్జెట్ ప్రసంగాన్ని వినేందుకు అసెంబ్లీకి వస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. నిబంధనల ప్రకారం అరవై వర్కంగ్ డేస్ సభకు హాజరు కాకపోతే అనర్హతా వేటు వేయడానికి స్పీకర్ కు అధికారం ఉంటుంది. ఈ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోతే.. కేసీఆర్ పై అనర్హతా వేటు వేయడానికి అవకాశం లభిస్తుంది. ఉపఎన్నికలు వస్తాయా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే అసెంబ్లీకి హాజరు కాని కారణంగా అనర్హతా వేటు అనేది కేసీఆర్ ఇమేజ్ కు మచ్చలా ఉంటుంది. అందుకే బీఆర్ఎస్ వ్యూహకర్తలు ఒక్కరోజు అసెంబ్లీ అనే ఫార్ములాకు ఓటేసినట్లుగా చెబుతున్నారు. అయితే ఏపీలో వైసీపీ గవర్నర్ ప్రసంగం రోజు వెళ్లినట్లుగా కాకుండా.. బిజినెస్ డేలోనే అంటే.. సభా కార్యక్రమాలు అధికారికంంగా జరుగుతున్నప్పుడే హాజరు కావాలని అనుకుంటున్నారు. ఒక్క సారి హాజరైతే..మరో అరవై రోజుల వరకూ హాజరు కాకపోయినా ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ నెలలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. పూర్తి స్థాయి బడ్జెట్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. కేసీఆర్ హాజరు కాకపోయినా అసెంబ్లీకి బీఆర్ఎస్ సభ్యులంతా హాజరై.. ప్రభుత్వాన్ని గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ కూడా వస్తే మరింతగా ప్రభుత్వాన్ని నిలదీయవచ్చని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా పదే పదే కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావడం లేదని ప్రశ్నిస్తోంది. దీంతో కేసీఆర్ అసెంబ్లీకి హాజరవనున్నారు. ఒక్క రోజే వస్తారా లేదా.. ప్రభుత్వంపై ఎదురుదాడికి ఇదే సరైన సమయం అని కంటిన్యూ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.