కాంగ్రెస్ లో జీవన్ రెడ్డి సంక్షోభం!

– జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ విషయంలో రేవంత్ ఏకపక్ష నిర్ణయం
– ఏకంగా రాజీనామాకే సిద్ధమైన కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి
– మంత్రుల బుజ్జగింపులతో వెనక్కి.. సీఎం రేవంత్ కు స్ట్రాంగ్ మెసేజ్

నిర్దేశం, హైదరాబాద్: అంతా చక్కగుంది అనుకునేలోపే అలజడులు రావడం రాజకీయాల్లో కామన్. కాంగ్రెస్ పార్టీలో అయితే మరీ కామన్. హస్తం పార్టీలో తరుచుగా కనిపించే వివాదం సీనియారిటీ. అదేంటో చిత్రం కానీ, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ లో సీనియారిటీ తగాదా పెద్దగా కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ తెలిసిన చాలా మందిని ఈ విషయం ఆశ్చర్యపరుస్తోంది. ఇదేంటని తలలు పట్టుకుంటున్న సందర్భంలోనే ఎట్టకేలకు ఈ వివాదం మరోసారి రాజుకుంది. జీవన్ రెడ్డి రూపంలో పార్టీలో సీనియారిటీ గొడవలకు తెర లేసిందా అనే చర్చ ప్రారంభమైంది.

వివాదానికి కారణం
కొద్ది రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సహా ఇతర నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. అంతే బానే ఉంది కానీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకునే వరకు ఇది అంతగా చర్చనీయాంశం కాలేదు. ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలో చేరికతో ఈ వివాదం పతాక స్థాయికి వెళ్లింది. జీవన్ రెడ్డి ఏకంగా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటించడంతో పార్టీలో సంక్షోభం వచ్చినంత పనైంది. కారణం, తాను వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిని పార్టీలోకి ఎలా తీసుకుంటారని, ఈ విషయమై తనకు కనీస సమాచారం లేదని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. అయితే సోమవారం ఉప ముఖ్యమంత్రి భట్టి సహా మంత్రులు శ్రీధర్ బాబు స్వయంగా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించడంతో రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించారు.

రేవంత్ రెడ్డి తీరే కారణమా?
కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారని గుర్తించి సీనియర్లను కాదని రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పీఠం కట్టబెంది కాంగ్రెస్ అధిష్టానం. అయితే పార్టీలో సీనియర్లకు అంత ప్రాధాన్యం ఉండట్లేదని అంతర్గత వర్గాల్లో చర్చ నడుస్తోంది. సీనియర్లను కాదని తనకు అనుకూలంగా వ్యవహరించే వ్యక్తులతోనే ప్రభుత్వాన్ని, పార్టీని రేవంత్ నడిపిస్తున్నారని అంటున్నారు. ఇంతకు ముందు కూడా రేవంత్ తీరుపై కొందరు సీనియర్లు వ్యతిరేకత తెలిపినప్పటికీ అవి బయటికి రాలేదు. కానీ, ఈసారి జీవన్ రెడ్డి రాజీనామా చేస్తానంటూ సంచలనం సృష్టించారు. సీనియర్లను కాదంటే పరిస్థితి వేరేలా ఉంటుందనే స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారని విమర్శకులు అంటున్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!