ఫ్రెండ్లి పోలీస్ అంటే ఇదేనా..!
– మహిళను కొట్టిన బోధన్ రూరల్ సీఐ ?
– కాంగ్రెస్ పెద్దల అండ ఉంటే అంతేనా..?
నిర్దేశం, నిజామాబాద్ :
ఫ్రెండ్లి పోలీస్.. ఔను.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలతో పోలీసులు ఫ్రెండ్లిగా ఉండాలని ఉన్నతాధికారుల ఆదేశాలు. తప్పు చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవడం అనావాయితీ.. కానీ.. నిజామాబాద్ జిల్లా బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు మాత్రం మహిళను కృరంగా కొట్టిన చర్యలు తీసుకునే నాథులు లేదు. కారణం..?
అధికార పెద్దలు ఆ పోలీసు అధికారికి అండగా ఉండటమే అనే టాక్. ఇటీవల నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేటలోని లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాల్లో బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు ప్రవర్తించిన తీరు మహిళల్ని తీవ్రంగా అవమాన పరిచినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సంఘటన జరిగి ఆరు రోజులు గడిచినా కేవలం నోటీస్ ఇచ్చిన పోలీస్ ఉన్నతాధికారులు చేతులు దులుపుకున్నారు. చిన్నపాటి సంఘటనల్ని పెద్దగా చేసి చూపే పోలీసులు, ఒక మహిళ పట్ల సీఐ ప్రవర్తించిన తీరును సమర్ధించడం వివాదాస్పమైంది. వివరాల్లోకి వెళితే… ఈనెల 13న జాన్కం పేట్ లక్ష్మి నరసింహస్వామి జాతర జరిగింది.
పెద్ద జాతర కావడంతో అనేక చోట్ల నుంచి జనం పెద్ద ఎత్తున వస్తారు. అట్లాగే రెంజల్ మండలం దూపల్లికి చెందిన బోయి భాగ్య తను పుట్టి పెరిగిన ఏడపల్లి మండలంలోని అంబేం గ్రామం కావడంతో అదే మండలంలో జరిగిన జాతరకు తన కొడుకుని తీసుకుని వెళ్ళింది. జాతరలో చేతిలోని పర్స్ పోగొట్టుకుంది. అందులో రూ. 300లు ఆధార్ కార్డు ఉన్నాయని ఏడ్చుకుంటూ పోలీసులకు పిర్యాదు చేసింది.
తనకు పర్స్ ఇప్పించాలని ఏడుస్తూ, పోలీసులపై ఒత్తిడి తెచ్చింది. అక్కడే ఉన్న సీఐ విజయ్ బాబు సహనం కోల్పోయి మహిళా అనే విచక్షణ మరిచి కొట్టడంతో తొడ భాగంలో తీవ్ర గాయం అయ్యింది. చర్మం కమిలిపోయింది. దీంతో అందరి ముందు కొడతావా అంటూ కోనేరులో దూకి చచ్చిపోతా అంటూ బెదిరించింది. ఇంకా రెచ్చిపోయిన సీఐ దుర్భాషలాడుతూ అక్కడ నుంచి పంపించి వేశాడు. తీవ్ర మనస్తవానికి గురైన భాగ్య మరుసటి రోజు ఎడపల్లి పోలీస్ స్టేషన్లో తనకు జరిగిన అవమానం సీఐ కొట్టిన దెబ్బలు చూపిస్తూ ఫిర్యాదు చేసింది.
అయినప్పటికీ పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయకపోగా అక్కడ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి అవమానపరిచారని భాగ్య ఆవేదన వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేసింది. అయినప్పటికీ ఇలాంటి చర్యలు చేపట్టకపోవడంతో పేదింటి మహిళ కన్నీరు మున్నీరు అవుతుంది. మహిళను చేయితో పట్టుకోవడమే పెద్ద నేరం. అలాంటిది వందలాదిమంది చూస్తుండగా జాతరలో మహిళను కొట్టడంపై పోలీసు ఉన్నతాధికారులు మౌనంగా ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబుపై చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు.