ఆసక్తికరంగా మారిన ఐపీఎల్ ఎడిషన్ 18

ఆసక్తికరంగా మారిన ఐపీఎల్ ఎడిషన్ 18

నిర్దేశం, హైదరాబాద్ః

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ చాలా ఆసక్తిగా కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు 25 మ్యాచ్ లు ముగిశాయి. ప్రస్తుతం ప్రతి మ్యాచ్ కూడా ప్లే ఆఫ్స్ ని దృష్టిలో పెట్టుకొని జట్లు ఆడుతున్నాయి. దీంతో ప్లే ఆఫ్స్ బెర్త్ కి చేరడానికి జరిగే ఈ సమరం మరింత ఉత్కంఠగా మారింది. ఇప్పటివరకు ఐపీఎల్ లో కొన్ని జట్లు బాగా ఆడగా.. కొన్ని జట్లు మాత్రం నిరాశపరిచాయి. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కలకత్తా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లు ఇప్పటివరకు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాయి. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని ఏకైక జట్టు ఢిల్లీ క్యాపిటల్స్.ఈ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లే ఆఫ్స్ కి చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇక గుజరాత్ టైటాన్స్ ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్లలో.. నాలుగు మ్యాచ్లలో విజయం సాధించి, ఒక మ్యాచ్ లో ఓడి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈ ఐపీఎల్ పాయింట్ల పట్టిక ఈ సీజన్ లో వింతగా కదులుతుంది. ఐపీఎల్ లో ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లతో పాటు గత సీజన్ రన్నరప్ హైదరాబాద్ చివరి మూడు స్థానాలలో నిలిచాయి. మూడు జట్లు ఐదు మ్యాచ్ ల తర్వాత చెరో నాలుగు ఓటములను చవిచూశాయి.ఈ జట్లు చెరో రెండు పాయింట్లు మాత్రమే కలిగి ఉన్నాయి. అలాగే నికర రన్ రేట్ కూడా మైనస్ లో ఉంది. ఐపీఎల్ 2025 లో ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే కనీసం ఏడు మ్యాచ్ లు గెలవాలి. ప్రతి జట్టు 14 మ్యాచ్లు ఆడుతుంది. ఇలా చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ఆరు మ్యాచ్లు ఆడింది. కానీ ఒక్క మ్యాచ్ లోనే గెలుపొందింది. అంటే ఈ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే మిగతా ఎనిమిది మ్యాచ్లలో తప్పనిసరిగా 6 మ్యాచ్లలో గెలుపొందాలి. కానీ ప్రస్తుతం ఆ జట్టు ఫామ్ చూస్తే అది కష్టమే అనిపిస్తుంది.

ఈ నేపథ్యంలో సీఎస్కే ప్లే ఆఫ్స్ ఆశలను ఫ్యాన్స్ వదులుకోవాల్సిందేనేమో.ఇక ఈ సీజన్ లో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఈ జట్టు 5 మ్యాచ్లలో ఒక మ్యాచ్ గెలిచి.. నాలుగు మ్యాచ్ లు ఓడింది. -1.629 నెట్ రన్ రేట్ తో చివరి స్థానంలో కొనసాగుతుంది. ఈ జట్టు ఇంకా 9 మ్యాచ్లు ఆడుతుంది. ఈ నేపథ్యంలో వరుస విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తుందేమో వేచి చూడాలి. ఈ సీజన్ లో ఇప్పటివరకు జరిగిన 25 మ్యాచ్లను బట్టి ప్లే ఆఫ్స్ వెళ్లేందుకు ఏ జట్టుకు ఎంత అవకాశం ఉందో “క్రిక్ ట్రాకర్” అంచనా వేసింది. దీని ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ {75%}, గుజరాత్ టైటాన్స్ {74%}, కలకత్తా నైట్ రైడర్స్ {55%}, పంజాబ్ కింగ్స్ {52%}, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు {50%}, లక్నో సూపర్ జెయింట్స్ {47%}, రాజస్థాన్ రాయల్స్ {26%}, ముంబై ఇండియన్స్ {11%}, చెన్నై సూపర్ కింగ్స్ {6%}, సన్రైజర్స్ హైదరాబాద్ {4%} ఉన్నాయి.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »