ఉద్యోగం కోసం కాకుండా.. ఉద్యోగ కల్పనకు భారత యువత ముందడుగు వేస్తోంది
– స్టార్టప్ ల ద్వారా వినూత్న ఆలోచనలతో కొత్త సంస్థలు పుట్టుకొస్తున్నాయి
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్ : భారతదేశ యువతలో అపారమైన శక్తి సామర్థ్యాలున్నాయని అందుకే వినూత్నమైన, సృజనాత్మకమైన ఆలోచనలతో.. ఉద్యోగాల కోసం వేచిచూడటం నుంచి. ఉద్యోగాలు సృష్టించే స్థితికి మన దేశ యువత ముందుకెళ్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్యారాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారతదేశం రానున్న రోజుల్లో ఈ దిశగా మరింత పురోగతి సాధించేలా కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక కార్యాచరణ రూపొందించిందని ఆయన అన్నారు.
శనివారం హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో జీ-20 స్టార్టప్ ఎంగేజ్‌మెంట్ గ్రూప్ సమావేశాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘స్టార్టప్ ల సదస్సుకు భారతదేశం సరైన వేదిక. భారతదేశంలో దాదాపు 85వేల రిజిస్టర్డ్ స్టార్టప్ కంపెనీలున్నాయి.
ప్రపంచంలోని అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ భారత్ సొంతం. దేశంలో 350 బిలియన్ డాలర్ల విలువ చేసే వందకు పైగా స్టార్టప్స్ ఉన్నాయి.
ప్రపంచంలో మూడో అతిపెద్ద యూనికార్న్ వ్యవస్థగా భారతదేశం నిలిచింది. ఇది గత కొంతకాలంగా దేశం ఈ రంగంలో సాధిస్తు్న్న విజయాలకు ఒక ఉదాహరణ మాత్రమే’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
స్టార్టప్ కంపెనీల అభివృద్ధే అజెండాగా రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో G20 దేశాల ప్రతినిధులు.. 9 దేశాల ప్రత్యేక ఆహ్వానితులు.. వివిధ అంతర్జాతీయ స్టార్టప్ సంస్థలు పాల్గొంటున్నాయి