పదవులు వదిలిస్తే సన్యాసి.. ప్రజలను వదిలేస్తే పవన్ కల్యాణ్
– ఉప ముఖ్యమంత్రి అయ్యాక పవన్ కు ముదిరిన దైవ భక్తి
– నోరు తెరిస్తే సనాతనం, ధర్మం, హిందువు తప్ప ఏమీ ఉండదు
– ఉప ముఖ్యమంత్రి హోదానే పక్కన పెట్టేసి మత ప్రచారంలో బిజీ
– యోగిని మించిపోయిన రాజకీయ సన్యాసి పవన్ కల్యాణ్
నిర్దేశం, హైదరాబాద్ః
చరిత్రలో అనేక మంది రాజులు రాజ్యాలను త్యజించి సన్యాసుల్లో కలిసిపోయారు. ఇక తాము తప్ప తమకంటూ ఏదీ ఉండనంత త్యాగం చేసేస్తారు. ఆస్తులుండవు, కుటుంబం ఉండదు. వారినే సన్యాసులు అంటారు. వందల ఏళ్లుగా ఇలా కొనసాగుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ దీన్ని రివర్స్ చేశాడు. రాజ్యం తనకు దక్కాక సన్యాసం తీసుకున్నాడు. అలా అని ఆయన ఆస్తిపాస్తులు వదిలేసుకున్నారంటే మీరు ఉప్పులో కాలేసినట్టే సుమా. తన కుర్చీని తన వద్దే పెట్టుకుని ప్రజల్ని త్యజించాడు. అందరు సన్యాసులు భోగభాగ్యాలను త్యజిస్తే.. పవన్ తన బాధ్యతలను, ప్రజలను త్యజించాడు. బహుశా.. హిందూ ధర్మ శాస్త్రాల్లో ఇలాంటి త్యాగం గురించి ఎక్కడా ఉండు. ఎందుకుంటుంది? ట్రెండ్ ను ఫాలో అయితే పవన్ కల్యాణ్ ఎలా అవుతాడు.. ఆయన ట్రెండ్ సెట్ చేస్తాడు.
యోగిని మించిపోయిన సన్యాసి
ఇంత చెప్పినా కూడా.. కొంత మందకి కోపం వస్తుంది. కనీస ఆలోచన లేకుండా “ఏంటీ.. మత భక్తి ఉన్నవాడు రాజకీయాల్లోకి రాకూడదా. మా హిందువులు ఉప ముఖ్యమంత్రులు కాకూడదా?” అంటారు. నిరభ్యంతరంగా రావచ్చు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అలాగే వచ్చాడు. దొంగలు, నేరస్తులే మన రాజకీయాల్లో సింహభాగం ఉన్నారు. సన్యాలు ఎందుకు రాకూడదు? కాకపోతే, తాము ఎక్కడ ఉన్నాం? తమ బాధ్యతలేంటి? అని వ్యహరించాలి. యూపీ సీఎం యోగి అలా వచ్చిన వాడే. ప్రజలకు ఆయన ఎంత మేలు చేస్తున్నాడని పక్కన పెడితే.. తన పాత్రలోనైనా జీవిస్తుండాడు యోగి. కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రిలా అయితే వ్యవహరిస్తున్నాడు. కానీ, ఉన్నట్టుండి సన్యాసి అయిన పవన్ కల్యాణ్.. యోగినే మించిపోయాడు. ధర్మం, సనాతనం, హిందూ.. ఇంతే. ఇవితప్ప పవన్ నోటి నుంచి గాలి శబ్దం కూడా వినిపించదు.
ఆ తిక్కకు లెక్క లేదు
“నాకొంచెం తిక్కుంది. కానీ, దానికో లెక్కుంది” అని సినిమాలో పవన్ కల్యాణ్ చెప్పే డైలాగ్ కి, నిజ జీవితానికి మొత్తం ఆపోజిట్ ఉంది. ఆనయకు తిక్కుంది. కానీ, అది లెక్క తప్పింది. పవన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆ తిక్క చూస్తూనే ఉన్నాం. అదెంత అని లెక్కలు తేల్చేందుకు చాలా మంది ప్రయత్నించి, చతికిలబడిపోయారు. కమ్యూనిస్టు పార్టీలతో కలవగానే.. ఆయనలో ఒక్కసారిగా విప్లవకారుడు నిద్రలేస్తాడు. ప్రజల్లో పేద, ధనిక వర్గాలు కనిపిస్తాయి. వెనకాల చెగువేరా ఫొటోలతో మైక్ పట్టుకుని తెగ ఊగిపోతాడు. ఆ తర్వాత బీఎస్పీతో కలుస్తాడు. ఇప్పుడు ఆయనకు ప్రజలు కులాలుగా కనిస్తారు. సమాజంలో కులదుర్మార్గంపై కన్నీళ్లు పెట్టుకుంటాడు. మాయావతి పాదాలను తాకి, సామాజిక బాధ్యతను గుర్తు చేసుకుంటాడు. ఇక ముచ్చటగా బీజేపీతో కలుస్తాడు. సీన్ కట్ చేస్తే.. ప్రజలు హిందూ-ముస్లింగా కనిపిస్తారు. తను నమ్ముతున్న హిందూ ధర్మంపై జరుగుతున్న అన్యాయాలపై గుండెలు బాధుకుంటాడు. ఇదంతా అబ్జర్వ్ చేస్తే.. పవన్ సినిమాల్లో కంటే రాజకీయంగానే బాగా నటిస్తున్నారని మీకు ఓ క్లారిటీ వచ్చి ఉంటుంది. కానీ, ఏ పాత్రను పర్మినెంట్ చేసుకోవాలో తెలియని అయోమయంలో పవన్ ఉన్నాడు.
ముగింపు
మంచి గుణము, సౌమ్యత, ఓపిక కంటే సమర్థత, బాధ్యత అనేవి నాయకుడికి చాలా ముఖ్యమైనవి. పవన్ వ్యక్తిగతంగా మంచివాడా, చెడ్డవాడా అనేది ఎవరికీ అవసరం లేదు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎలాంటి వాడు అన్నది చాలా ముఖ్యం. తన బాధ్యత నెరవేర్చలేని మంచితనం ఎవరికీ అక్కర్లేదు. దాన్ని మంచితనం అంటే అంత కంటే వెర్రితనం ఉండదు. పరిస్థితి ఎలాంటిదైనా, సమస్య ఎలాంటిదైనా దానికి పరిష్కారం చూపలేనప్పుడు నాయకుడు అవ్వలేడు. పవన్ కు బాధ్యత కొద్దిగా కూడా లేదు. సిగ్గు అసలే లేదు. రాష్ట్రంలో రెండో అత్యంత ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి.. తన బాధ్యతలు వదిలేసి ఏవేవో సమస్యల మీద తిరుగుతుంటాడు. అలా అని ఆయనను అవి చేయొద్దని కాదు. తనకు ఉపముఖ్యమంత్రి కంటే అవే ముఖ్యమనుకుంటే.. పదవికి రాజీనామా చేసి సుబ్బరంగా ధర్మ పోరాటాలు చేసుకోవచ్చు. ఇకపోతే.. తిరుపతిలో లడ్డూ కల్తీ అయిందంటే.. పవన్ నిరసనకు దిగాడు. ప్రశ్నించాలని ప్రజలను రెచ్చగొట్టాడు. ఏదేదో జరుగుతోందని భయభ్రాంతులకు గురి చేశాడు. నిజానికి అధికారమంత ఆయన చేతిలోనే ఉంది. దేవుడైనా సరే.. ప్రభుత్వంలో ఉన్నవాడు చెప్పినట్టే వినాలి. అంత గొప్పది అధికారం. ఎలాంటి సమస్య వచ్చినా.. వెంటనే పరిష్కరించాలి. కానీ, అది వదిలేసి ప్రతిపక్ష నాయకుడిలా రోడ్డుపై తొడలు కొట్టాడు. పవన్ కు సమర్థత లేదని అర్థం అవుతోంది కదా. అంతకన్నా ఆయనకు కనీస బుద్ధి లేదన్నది సుస్పష్టం.