నిర్దేశం, హైదరాబాద్ః ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలన్నది సామెత. పైకి కనిపించరు కానీ.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ విషయంలో దిట్టలు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే.. వారికి అనుకూలంగా మారిపోయి పనులు చేయించుకోవడం, కాన్నాలు పెట్టి మింగేయడంలో ఘనాపాటి వీళ్లు. అలా అని బ్యూరోక్రాట్లంతా అలా అని చెప్పడం లేదు. వారికి ఉన్న రక్షణ వ్యవస్థ, అధికారాల వల్ల బయటపడటం లేదు కానీ, చాలా మంది అధికారులు, ఆమ్యామ్యులే. సందర్భాన్ని బట్టి వీళ్లు బయట పడుతూ ఉంటారు. రాష్ట్రంలో సర్కారు మారిన తర్వాత కొందరి అధికారుల అవినీతి డొంకలు కదులుతున్నాయి. కేసీఆర్ సర్కారులో ఉంటూ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ బ్యూరోక్రాట్ల అసలు బాగోతం బయటికి వస్తోంది. ఇప్పటి వరకు ఐఏఎస్ అమోయ్ కుమార్, ఐఏఎస్ నవీన్ మిట్టల్, మాజీ సీఎస్ సోమేష్ కుమార్, ఐఏఎస్ అరవింద్ గుట్టు రట్టైంది. కూపీ లాగుతూ పోతే ఇంకెంత మంది బయటికి వస్తారో మరి.
భూమిపైనే ఎక్కువ మంది కన్ను
అవినీతి ఐఏఎస్ అధికారుల లిస్టులో అమోయ్ కుమార్ టాప్ లో ఉన్నారు. ఆయనపై వస్తున్న ఆరోపణలు మామూలుగా లేవు. హైదరాబాద్ లో ఏ మూలన భూదందా గురించి మాట్లాడినా అమోయ్ కుమార్ పేరే వినిపిస్తోంది. వందల ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్ పరం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హవ్వా.. రాజధానిలో ఇంత పెద్ద స్కాం చేయడానికి ప్రభుత్వమే జంకుతుంది. ఒక ఐఏఎస్ అధికారి చేయడమంటే చాలా పెద్ద ఫీట్ అని చెప్పాలి.
ఇక ఐఏఎస్ నవీన్ మిట్టల్ సంగతి సరే సరి. ఈయన అవినీతి గురించి గతంలో కోర్టులు మొట్టికాయలు వేసినా ఆయన మాత్రం మాటు వేసి అవినీతి చేస్తూనే ఉన్నారు. భూకుంభకోణాలు, ఆస్తులు కూడగట్టాలనే ఆలోచన ఉన్న యువ ఐఏఎస్ లకు ఆదర్శం ఈయన. ఇక సీఎస్ గా రాష్ట్రానికి అతిపెద్ద హోదాలో పని చేసిన సోమేశ్ కుమార్.. తన హోదాకు తగ్గట్టే అవినీతి చేశారు. ఒక్క జీఎస్టీ స్కామే రూ.1,000 కోట్లట. ఇక బయటపడనివి ఎన్నో. నిన్నీమధ్య ఈ జాబితాలో చేరారు ఐఏఎస్ అరవింద్. అవినీతిలో పై ముగ్గురి అంతటి పేరు సంపాదించలేదు కానీ, బహుశా వారిని ఆదర్శంగా తీసుకున్నట్లే కనిపిస్తోంది. అవినీతిలో ఈయనకు వాటా ఉందని స్వయంగా శివబాలకృష్ణే చెప్పడం గమనార్హం.
నెహ్రూ, మోదీ వ్యతిరేకించారు
సివిల్ సర్వీస్ అధికారులకు ఉన్న రక్షణ రాజకీయ నాయకులకు కూడా లేదు. అందుకే, వారి అక్రమాలను బయటికి లాగేందుకు రాజకీయ నేతలు కూడా భయపడతారు. అయితే అన్ని సార్లు అందరూ అమోయ్ కుమార్లు ఉండరు.. అక్కడక్కడ శ్రీలక్ష్మీలు కూడా ఉంటారు. నిజానికి.. బ్రూరోక్రసీ వ్యవస్థని మొదటి ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రూ వ్యతిరేకించారు. దీనిని కొలోనియల్ సిస్టం అని అన్నారు. కానీ, దాన్ని నియంత్రించలేకపోయానని వాపోయారు. మొన్నామధ్య ప్రధాని మోదీ కూడా దాదాపుగా ఇలాగే మాట్లాడారు. అయినా వారిని నియంత్రించే ప్రయత్నంలో మోదీ కూడా విఫలమయ్యారు.
నియంత్రణ సరిపోదు, స్వీయ నియంత్రణ పాటించాలి
భారతీయ సమాజంలో బ్యూరోక్రాట్లకు చాలా గౌరవం ఉంటుంది. అలాగే, వారికి చాలా పవర్స్ కూడా ఉంటాయి. ఇవి కాకుండా ఇళ్లు, కారు నుంచి సకల సౌకర్యాలు ప్రభుత్వమే ఇస్తుంది. ప్రభుత్వం తరపున అంతటి దర్జా జీవితం ఉన్నాక కూడా ఎవరికీ చెప్పుకోలేని ఆ అవినీతిలో వేళ్లు పెట్టాలన్న ఆలోచనలో అధికారులు ఉండడమే విడ్డూరం. మన వ్యవస్థ దృష్ట్యా బ్యూరోక్రాట్లను నియంత్రించడం ప్రభుత్వాలకు కూడా అంత సులువు కాదు. కారణం, కార్యనిర్వాహక శాఖలో కీలకంగా వీళ్లే ఉంటారు. కావున.. వాళ్లే స్వీయ నియంత్రణ పాటించాలి. రాజకీయ నాయకులకు కూడా అవినీతి నేర్చించే అధికారులు ఉన్నారన్నది ఎప్పటి నుంచో వినిపించే మాట. ముందు దీన్ని కడుక్కోవాలి