వివేకా రెడ్డి హత్యలో భారీ కుట్ర..

వివేకా హత్యలో భారీ కుట్ర..

సీబీఐ కౌంటర్‌లో సంచలన విషయాలు

8 వ నిందితుడిగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి

హైదరాబాద్ జూన్ 8 : వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ పై కౌంటరులో సీబీఐ అధికారులు పలు సంచలన అంశాలు ప్రస్తావించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ని ఎనిమిదో నిందితుడు (A8)గా పేర్కొన్నారు. కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డిల ప్రమేయం ఉందని పేర్కొన్నారు.

దర్యాప్తును పక్కదారి పట్టించేలా తండ్రీ కుమారులు నిరంతరం ప్రయత్నిస్తున్నారని స్పష్టం చేశారు. వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాల ధ్వంసం వెనక భారీ కుట్రపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.ఎన్.శివశంకర్ రెడ్డి ఫోన్ చేసిన నిమిషంలోపే అవినాష్ రెడ్డి హత్యస్థలికి చేరుకున్నారని, ఆ రోజు ఉదయం 5:20 గంటలకు ముందే అవినాష్ రెడ్డి, శివశంకర్‌రెడ్డిలతో గంగిరెడ్డి మాట్లాడినట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

కేసు పెట్టొద్దని, పోస్టుమార్టం వద్దని సీఐ శంకరయ్యకు అవినాష్, శివశంకర్ రెడ్డి చెప్పారని వివరించారు. సీబీఐకి, కోర్టుకు ఏమీ చెప్పొద్దని దస్తగిరిని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారన్నారు. దస్తగిరిని ప్రలోభపెట్టేందుకు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్‌రెడ్డి అనేక ప్రయత్నాలు చేశారని సీబీఐ అధికారులు కౌంటర్‌లో పేర్కొన్నారు.

భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇస్తే దర్యాప్తును, కీలక సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ అధికారులు అన్నారు. కడప, పులివెందుల ప్రాంతాల్లో భాస్కర్‌రెడ్డి చాలా ప్రభావితం చేయగల వ్యక్తి అని, అరెస్టు చేసినప్పుడు కడపలో జరిగిన ధర్నాలు, ప్రదర్శనలే భాస్కర్‌రెడ్డి బలానికి నిదర్శనమన్నారు. భాస్కర్‌రెడ్డి బయట ఉంటే చాలు.. పులివెందుల సాక్షుల ప్రభావితమైనట్లేనని అధికారులు పేర్కొన్నారు. భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇస్తే ఎన్ని షరతులు పెట్టినా నిరుపయోగమేనన్నారు. సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేస్తే కేసుకు పూడ్చలేని నష్టం జరుగుతుందని, దర్యాప్తునకు సహకరించానని భాస్కర్‌రెడ్డి చెప్పడం అబద్ధమని అన్నారు.

కడప ఎస్పీ సమాచారం మేరకు భాస్కర్‌రెడ్డిపై గతంలో మూడు కేసులున్నాయని, పేలుడు పదార్థాల చట్టం సహా మూడు కేసులు గతంలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారన్నారు. రెండు కేసులు వీగిపోగా.. మరొకటి తప్పుడు కేసుగా తేల్చి కొట్టివేశారని, కేసుల ప్రకారం భాస్కర్‌రెడ్డి నేపథ్యం ప్రశ్నార్థకంగా కనిపిస్తోందన్నారు. వివేకా హత్యలో ప్రమేయాన్ని చూసినా.. భాస్కర్‌రెడ్డి నేపథ్యం ప్రశ్నార్థకమేనన్నారు. ఏప్రిల్ 16 నుంచి జైళ్లో ఉన్నంత మాత్రాన బెయిల్‌‌కు కారణం కారాదన్నారు. వివేకా హత్య విషయం సీఎం జగన్‌కు ఆరోజు ఉదయం 6.15 గంటలకు ముందే తెలుసునని, వివేకా పీఏ బయటకు చెప్పకముందే జగన్‌కు తెలుసని దర్యాప్తులో గుర్తించినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.

మరోవైపు వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని వివేకా కుమార్తె సునీత కోరుతూ.. సీబీఐ కోర్టులో లిఖితపూర్వక వాదనలు సమర్పించారు. వివేకా హత్య కేసు లోతుగా దర్యాప్తు జరగాల్సి ఉందని, భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇస్తే సాక్షులను, దర్యాప్తును ప్రభావితం చేస్తారన్నారు. భాస్కర్‌రెడ్డి ప్రమేయంపై పలువురు సాక్షుల వాంగ్మూలాలను సునీత ప్రస్తావించారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!