ప‌రువు హ‌త్యన‌డం కూడా కులోన్మాద‌మే

ప‌రువు హ‌త్యన‌డం కూడా కులోన్మాద‌మే

నిర్దేశం, హైద‌రాబాద్ః

అప్పుడెప్పుడో ప్ర‌ణ‌య్ హ‌త్య జ‌రిగిన అంన‌త‌రం.. తాజాగా ఆ కేసులో ఒక‌రికి మ‌ర‌ణ శిక్ష ప‌డ‌గా, మిగిలిన వారికి యావ‌జ్జీవ శిక్ష‌లు ప‌డ్డాయి. నిన్న‌టి హెడ్ లైన్ల‌లో ఎక్క‌డ చూసినా.. ప‌రువు హ‌త్య కేసులో తీర్పు అంటూ వ‌స్తున్నాయి. ప్రేమ పెళ్లి అనంత‌రం.. అమ్మాయి త‌ర‌పు బంధువులో, అబ్బాయి త‌ర‌పు బంధువులో ప్రేమికుల్ని చంపేస్తుంటారు. దానిని సాధార‌ణ ప్ర‌జ‌లే కాకుండా మీడియా కూడా ప‌రువు హ‌త్య అని సంబోధిస్తుంటారు. నిజానికి.. మీడియా ప్ర‌చారం చేయ‌డం వ‌ల్లనే సాధార‌ణ ప్ర‌జ‌లు ఇలా సంబోధిస్తున్నారంటే బాగుంటుంది. చాలా కాలంగా అంతు చిక్క‌ని ప్ర‌శ్న ఇది. కులాంతర వివాహం చేసుకుంటే ఎవ‌రి ప‌రువు పోతుంది? స‌రే బ‌య‌టికి చెప్ప‌క‌పోయినా.. ఎస్సీ, ఎస్టీల‌ వ్య‌క్తిని పెళ్లి చేసుకున్నందుకు ఓసీల‌ది, బీసీల‌ది ప‌రువు పోతుంద‌నేదే క‌దా వాద‌న‌. ఎందుకంటే ఇలాంటి కార‌ణాల‌తో ఎస్సీ, ఎస్టీ ప్ర‌జ‌లు ప్రాణాలు తీసుకునే వ‌ర‌కు వెళ్ల‌రు.

ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే.. అదేదో సినిమాలో త‌మ ఊరి వాళ్లంద‌రినీ పిలిపించి.. మ‌న ఊళ్లో స‌గం మంది వెధ‌వ‌లు అంటాడు. అంద‌రికీ చాలా కోపం వ‌స్తుంది. స‌రే.. ఇలా కాదు, మ‌న ఊళ్లో స‌గం మాత్ర‌మే తెలివైన వారు అంటాడు. అప్పుడు ఎవ‌రూ అభ్యంత‌రం చెప్ప‌రు. ఇక్కడ కులం కూడా ఇలా రూపాంతరం చెందింది. వేరే కులం వారిని పెళ్లి చేసుకున్నార‌ని చంపారంటే.. చాలా మందికి కోపం వ‌స్తుంది. చూశారా.. వీడికెంత కుల బ‌లుపో అంటారు. దీన్నే నైస్ గా ప‌రువు హ‌త్య అంటున్నారు. మంచి పేరు క‌దా.. పాపం త‌ల్లిదండ్రుల గౌర‌వం పోదా మ‌రి అంటారు. నిజ‌మే.. వేరే కులం వారిని పెళ్లి చేసుకుంటే వారి ప‌రువేమైపోను? ఇలా అందంగా కుల వివ‌క్ష చూపిస్తున్నారు.

‘పరువు హత్య’ అనే పేరుతో వీటిని పిలిస్తే.. సామాజికంగా జరుగుతున్న ద్రోహంలో మనం కూడా భాగస్వాములం అయినట్టు లెక్క! కులం అనే విషాన్ని బుర్ర నిండా నింపుకున్న వాళ్లు మాత్రమే.. వీటిని ‘పరువు హత్య’ అనే పేరుతో పిలుస్తారు. ఎలాంటి పరువు కోసం ఈ హత్యలు జరుగుతున్నాయి? వేరే కులం వాడిని ప్రేమించినందుకు, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నందుకే కదా ఇవి జరుగుతున్నాయి? కులం తప్ప ఇంకో ప్రాతిపదిక వీటికి లేదు. డ‌బ్బు లేద‌నో, జ‌బ్బు ఉంద‌నో, మ‌న ప్రాంతం వాడు కాద‌నో, మందు అల‌వాటు ఉంద‌నో ఇలాంటి హ‌త్య‌లు ఎప్పుడైనా చూశారా?

ఇవన్నీ కులోన్మాద హ‌త్య‌లే. కుల ఉగ్ర‌వాద హ‌త్య‌లే. వీటికి ‘పరువు’ అనే పదాన్ని జోడిరచి.. ఈ హత్యలకు పాల్పడిన వారిపట్ల కించిత్తు సానుభూతిని పుట్టించే ప్రయత్నం చేయకండి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఇలాంటి దుర్మార్గాలు బయటపడుతూనే ఉన్నాయి. ‘పరువు’ అనే మాట చాలా విలువైనది. కానీ, సంకుచితమైన విషయాల్లో అనేక మార్లు ఆ పదం వాడబడుతున్నప్పుడు.. సామాజిక స్పృహ ఉన్న ఎవరికైనా సరే.. కించిత్తు బాధ కలుగుతుంది. ప్రత్యేకించి.. పిల్లలు ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నప్పుడు.. సహించలేని తల్లిదండ్రులు వారిద్దరినీ లేదా వారిలో ఒక్కరినీ కడతేర్చడానికి తెగిస్తే.. అలాంటి సందర్భాల్లో పరువు హత్య అని అభివర్ణించడం చాలా దారుణం. నిజానికి, కులం కాకుండా ఒక కుటుంబానికి వేరే విషయంలో ఏదైనా ఒకస్థాయి, గుర్తింపు, సంఘంలో గౌరవం ఉండి.. దానిని నాశనం చేసేలాగా ఆ కుటుంబంలోని వారు వ్యవహరించినప్పుడు చంపేస్తే మాత్రమే అవి పరువు హత్యలవుతాయి.

ఉదాహ‌ర‌ణ‌కు.. ఒక గొప్ప సంగీతకారుడి కుటుంబం ఉందనుకుందాం. సంగీతాన్ని భ్రష్టు పట్టించే, అవమానించే దుష్టుడు ఒకడు ఆ కుటుంబంలో పుడితే.. అలాంటి వాడిని అంతం చేస్తే దానిని పరువు హత్య అనవచ్చు. ఒక కుటుంబానికి కులం తప్ప మరేమీ లేనప్పుడు.. కులం అనేది పరువుకు చిహ్నంగా భావించడం ఉగ్ర‌వాదం కంటే దారుణం. ముందు ఇలాంటివి రాకుండా చూడాలి. ఒక‌వేళ వ‌స్తే.. కాస్త క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రించాలి. కానీ, మొత్తంగా అగ్ర‌కులాల చేత నిండిపోయిన వ్య‌వ‌స్థ‌ల్లో క‌ఠినం కాదు క‌దా.. క‌నీస‌మైనా స్పందించ‌రు. పైగా, రేప్ చేసిన వాడికే అమ్మాయినిచ్చి పెళ్లి చేయాల‌నే దిక్కుమాలిన తీర్పులు ఇస్తుంటే.. ఇక కులం గురించి ఏం చేయ‌మంటాంలే.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »