విద్వేషం-విధ్వంసం మా విధానం కాదు
హైదరాబాద్, నిర్దేశం:
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. రాహుల్ గాంధీ మతం గురించి మాట్లాడడంపై రుసరుసలాడారు.దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టి జనాభా ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు, రిజర్వేషన్లు కల్పించాలన్నదే తమ నేత రాహుల్‌గాంధీ అభిమతమన్నారు మంత్రి సీతక్క. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది న్యాయం చేయాలని చూస్తున్నారన్నారు. ఈ క్రమంలో కుల గణన కోసం అగ్రనేత డిమాండ్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు.దేశవ్యాప్తంగా బీసీ కులగలన కోసం రాహుల్ పట్టుబడుతున్నారని గుర్తు చేశారు సీతక్క. కులగణన అంశాన్ని పక్కదారి పట్టించేందుకు బీజేపీ నేతలు ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారని దుయ్యబట్టారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ, విజన్ ఉన్న నాయకుడిగా వర్ణించారు. మూడు దశాబ్దాలుగా ఎలాంటి మంత్రి పదవుల్లో లేకుండా దేశం కోసం పని చేస్తున్న విషయం మీకు తెలీదా అంటూ ప్రశ్నలు రైజ్ చేశారు.గ్రామ స్థాయి నుంచి ప్రధాని వరకు రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ కించపరిచే విధానం మంచిది కాదన్నారు మంత్రి. విద్వేషం, విధ్వంసమే బీజేపీ విధానమన్నారు. ప్రేమ, శాంతి, సమానత్వం కోసం ఆయన పని చేస్తున్నారని గుర్తు చేశారు. బీజేపీ విధ్వంస రాజకీయాలు కావాలో, కాంగ్రెస్ శాంతి, సమానత్వం, అభివృద్ధి కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు.కుల గణన అంశాన్ని డైవర్ట్ చేయడం కోసమే రాహుల్ గాంధీ మతంపై బీజేపీ చర్చ చేస్తున్న విషయం నిజం కాదా అంటూ మండిపడ్డారు. పదేళ్లుగా పేదల సంక్షేమం కోసం బీజేపీ ఏం చేసిందని సూటిగా విమర్శలు గుప్పించారు. విభజన రాజకీయాలతో పదవులు పొందటం ఆ పార్టీ నేతల నైజమన్నారు. పదవుల కోసం పాకులాడే మనిషి రాహుల్ కాదన్నారు.త్యాగాల వారసత్వంతో సమాజ అభివృద్ధి కోసం, సమ సమాజ లక్ష్యం కోసం పోరాటం చేస్తున్నారని వివరించారు. అదానీ ఆస్తుల పెంపకం కోసం రాహుల్ గాంధీ పని చేయటం లేదని సెటైర్లు వేశారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అంతరాలు లేని సమాజమే రాహుల్ గాంధీ ప్రధాన లక్ష్యమన్నారు.విద్వేష రాజకీయాలతో సమాజం వెనుకబాటుకు దారి తీస్తుందని చెప్పుకొచ్చారు. తొలి ప్రధాని నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ సంస్కరణలే ఇవాళ దేశాన్ని నిలబెడుతున్నాయని మనసులోని మాట బయటపెట్టారు. రాజ్యాంగ మీద ప్రమాణం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్, ఇలాంటి ప్రసంగాలు చేయడం ముమ్మాటికీ రాజ్యాంగాన్ని అవమానించడమేనన్నారు మంత్రి సీతక్క.