కింగ్ కోఠి నుంచి ఆర్మూర్ కు..32 దొంగ బైక్ లు
కింగ్ కోఠి నుంచి ఆర్మూర్ కు..32 దొంగ బైక్ లు
ఇంటోళ్లే అసలు దొంగలు..
నిర్దేశం, నిజామాబాద్ :
హై ఫైవ్ బైక్.. లక్షలు వెచ్చించిన ఆ బైక్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో అతి తక్కువ ధరకు బైక్ లు విక్రయాలు.. తక్కువ ధరకు దొరుకుతుందంటే ఎగిరి గంతలేసే వాళ్లే ఎక్కువ.. ఇగో.. తక్కువ ధరలకు కొనుగోలు చేసిన బైక్ లన్నీ దొంగయే.. పోలీసులు రంగ ప్రవేశం చేసి స్వాధీనం చేసుకోవడంతో కొనుగోలు చేసిన దొంగలు లబోదిబో మంటున్నారు.

హైదరాబాద్ లోని కింగ్ కోఠి కేంద్రంగా కొనసాగిన బైక్ స్కామ్ మూలాలు ఆర్మూర్ లో కనిపించాయి. కొందరు వ్యక్తులు వివిధ సంస్థలకు చెందిన బైకులను విక్రయించే ఏజెన్సీలను కింగ్ కోఠీలో ఏర్పాటు చేసి సదరు కంపెనీల నుంచి కొత్త బైకులను కొంటారు. అనంతరం వాటిని నిబంధనల ప్రకారం వినియోగదారులకు విక్రయించకుండా ఆ బైకులు చోరీకి అయ్యాయని వివిధ పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేస్తారు.
ఆ బోగస్ ఏజెన్సీల మాటలు నమ్మి పోలీసులు కేసులు నమోదు చేస్తారు. ఆ కేసులకు సంబంధించిన ఎఫ్ ఐ ఆర్ ఆధారంగా బోగస్ సంస్థలు ఎన్ని బైకులు చోరీకి గురైనట్టు చిత్రీకరిస్తారో అన్ని బైకులకు బీమా సొమ్ము క్లెయిమ్ చేస్తారు. అనంతరం ఆ బైకులు ఎలాంటి రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండా గ్రామీణ ప్రాంతాలకు చెందిన అమాయకులకు విక్రయిస్తూ మరోమారు సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం కొన్ని ముఠాలు ఈ దందాను పక్కాగా నడిపిస్తూ బైకులను సగం ధరలకే అమ్ముకోవడం, మరి కొన్ని బైకులను విడి భాగాలుగా అమ్ముకోవడం చేస్తున్నారు. ఈ బైకులను ఇతర రాష్ట్రాలు లేదా ఇతర జిల్లాల్లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరకు వాటిని విక్రయించడమే పనిగా పెట్టుకున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున దొంగ బైకులు వెలుగు చూడగా పోలీసులు సీజ్ చేశారు. అంకాపూర్ లో 5, మిర్దాపల్లిలో 10, డొంకేశ్వర్ లో 2, మైలారంలో 15 దొంగ బైకులను పోలీసులు సీజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అమాయకులను నిలువునా ముంచుతున్న మాఫియా ఆగడాలు ఆర్మూర్ నియోజకవర్గంలో విచ్చలవిడిగా సాగుతుండగా, దీని వెనుక ముఖ్య ప్రజాప్రతినిధి ఉన్నారని మరో మాజీ ప్రజాప్రతినిధి సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రజాప్రతినిధికి సంబంధించిన వ్యక్తులు కింగ్ కోఠి కేంద్రంగా బైక్ ల స్కామ్ చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. తమకు దొంగ బైక్ లు అంటగట్టిన వ్యక్తులపై చర్యలు తీసుకుని దోషులను కఠినంగా శిక్షించాలని మరో వైపు బాధితులు కోరుతున్నారు.
Translate »