అస్సాం రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వరదలు
వరదలలో చిక్కుకున్న 1.20 లక్షల మంది ప్రజలు
అస్సాం జూన్ 22 : అస్సాం రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాలకు పోటెత్తిన వరద కారణంగా రాష్ట్రం అతలాకుతలమవుతోంది. సుమారు 20 జిల్లాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. ఎక్కడికక్కడ రోడ్లు దెబ్బతిన్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షానికి నదులు పొంగి పొర్లుతున్నాయి. పలు నదులు ఉగ్రరూపం దాల్చి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.
20 జిల్లాల్లో దాదాపు 1.20 లక్షల మంది వరదల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ప్రకారం.. అస్సాం సహా పొరుగు దేశమైన భూటాన్ లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో అనేక నదులు పొంగి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో బజలి, బక్సా, బార్పేట, బిశ్వనాథ్, చిరాంగ్, దర్రాంగ్, ధేమాజీ, ధుబ్రి, దిబ్రూఘర్, గోలాఘాట్, హోజాయ్, కమ్రూప్, కోక్రాఝర్, లఖింపూర్, నాగావ్, నల్బరి, సోనిత్ పూర్, తముల్ పూర్, ఉడల్ గురి జిల్లాల్లోని 45 రెవెన్యూ గ్రామాల పరిధి గల 780 గ్రామాలు ముంపునకు గురయ్యాయి.
నల్బరీ జిల్లాలో 44,707 మంది, బక్సాలో 26,571 మంది, లఖింపూర్ లో 25,096 మంది, తముల్ పూర్ లో 15,610 మంది, బార్ పేట జిల్లాలో 3,840 మంది ప్రజలు ప్రభావితులయ్యారు. మరోవైపు వరదల కారణంగా ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 1.07 లక్షల పెంపుడు జంతువులు, కోళ్లు కూడా దెబ్బతిన్నాయి. వరద కారణంగా రాష్ట్రంలో బుధవారం నాలుగు కట్టలు, 72 రోడ్లు, 7 వంతెనలు దెబ్బతిన్నాయి.మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF), ఫైర్, ఎమర్జెన్సీ సర్వీసెస్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద ప్రభావిత జిల్లాల్లో 14 సహాయక శిబిరాలు, 17 సహాయ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బక్సా, ధుబ్రి, కోక్రాఝర్, నల్పారి, తముల్పూర్ జిల్లాల్లోని సహాయ శిబిరాల్లో సుమారు 2,091 మంది ప్రజలు తలదాచుకుంటున్నారు.